తమిళనాడు డిప్యూటీ సీఎంగా స్టాలిన్ కుమారుడు..! తండ్రిదే నిర్ణయమన్న ఉదయనిధి

డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ కు త్వరలోనే డిప్యూటీ సీఎంగా పట్టం కట్టనున్నారని తమిళ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.

Udhayanidhi stalin to become Tamil Nadu deputy chief minister he says rumour

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వివాదస్పద వ్యాఖ్యలతో పతాక శీర్షికల్లో నిలిచిన డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి కానున్నారన్న ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే డిప్యూటీ సీఎంగా ఆయనకు పట్టం కట్టనున్నారని తమిళ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఆయన తమిళనాడు క్రీడల శాఖ మంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి MK స్టాలిన్ ఫిబ్రవరిలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారని, దానికి ముందే తన కుమారుడిని డిప్యూటీ సీఎం చేయాలని భావిస్తున్నట్టు అధికార డీఎంకే పార్టీ వర్గాలు తెలిపాయని ఇండియా టుడే వెల్లడించింది. జనవరి 21న సేలంలో జరగనున్న పార్టీ యూత్ వింగ్ సమావేశం తర్వాత ఉదయనిధికి పట్టం కట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధిని నియమిస్తారనే విషయం తనకు తెలియదని డీఎంకె ఆర్గనైజేషనల్ సెక్రటరీ టీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. పార్టీలో ఉదయనిధి చురుకైన నాయకుడని, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం సముచితమేనని అన్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌దేనని ఇళంగోవన్ స్పష్టం చేశారు. త్వరలోనే తాను డిప్యూటీ సీఎం అవుతానని వస్తున్న వార్తలను ఉదయనిధి స్టాలిన్ తోసిపుచ్చారు. అవన్నీ ఊహాగానాలేనని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ అని క్లారిటీ ఇచ్చారు.

Also Read: చంద్రబాబుపై విమర్శలు చేసిన కేఏ పాల్.. పవన్ కల్యాణ్‌కు మాత్రం ఓ రిక్వెస్ట్.. అదేమిటంటే?

ఈ వార్తలను రూమర్లుగా కొట్టిపారేయలేమని, నిప్పు లేనిదే పొగ రాదని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం పేరుతో రాష్ట్రంలో డీఎంకే కుటుంబ పాలన సాగిస్తోందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ విమర్శించారు. స్టాలిన్ కుమారుడన్న ఒకే ఒక్క కారణంతో ఉదయనిధికి ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇచ్చి మంత్రిని చేశారని.. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటున్నారని వ్యాఖ్యానించారు. డీఎంకేలో ప్రజాస్వామ్యం లేదని, కుటుంబ పాలన మాత్రమే ఉందని ధ్వజమెత్తారు. కానీ తమ పార్టీలో అలా కాదని, సామాన్య కార్యకర్త కూడా ఏఐఏడీఎంకే అధినేత కాగలడని సత్యన్‌ తెలిపారు.

Also Read: భారత్ – మాల్దీవుల వివాదం వేళ.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన చైనా.. ఇజ్రాయెల్ అభ్యర్థన ఇదే..