ఇది టూమ‌చ్: సీఎం చెంప ప‌గ‌ల‌గొట్టిన వ్య‌క్తి

  • Publish Date - May 4, 2019 / 01:11 PM IST

ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్ పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కేజ్రీవాల్‌పై చేయి చేసుకున్నాడు. కేజ్రీవాల్ చెంప మీద కొట్టాడు. ఢిల్లీలోని మోతీ నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఓపెన్ టాప్ జీప్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా రెడ్ కలర్ టీ షర్ట్ ధరించిన వ్యక్తి ముందు వైపు నుంచి జీప్ ఎక్కి.. కేజ్రీవాల్ ను చెంప దెబ్బ కొట్టాడు. దీంతో కేజ్రీవాల్ సహా అక్కడున్న వారంతా షాక్ తిన్నారు.

వెంటనే తేరుకున్న కేజ్రీవాల్ అనుచరులు, ఆప్ నాయకులు ఆ వ్యక్తిని కిందకు లాగేశారు. ఆ తర్వాత అతడిని కొట్టడం ప్రారంభించారు. ఇంతలో జోక్యం చేసుకున్న పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని మోతీ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. గతంలోనూ కేజ్రీవాల్‌ పై ఇలాంటి భౌతిక దాడులు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీని విమర్శించినందుకు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.