సోషల్ మీడియా చట్టంపై వెనక్కి తగ్గిన కేరళ

Kerala govt holds back social media law పోలీసు చట్ట సవరణపై కేరళ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. వివాదాస్పదంగా మారిన ‘కేరళ పోలీసు చట్ట’ సవరణ ఇప్పట్లో ఉండబోదని పినరయి విజయన్ ప్రభుత్వం తెలిపింది. కొత్త చట్టంలో మార్పులు చేస్తూ తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాన్ని ఇప్పుడే అమలు చేయబోమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు.
వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూలంకషంగా చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పోలీసు చట్టానికి మార్పులు చేస్తున్నామని ప్రకటించగానే వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మా ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వర్గాల నుంచీ ఆందోళన వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సవరించిన చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం సరైన చర్య కాదని భావిస్తున్నాం. దీనిపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూలంకషంగా చర్చిస్తాం. అన్ని పార్టీల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎం పినరయి విజయన్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
కాగా, గతవారం కేరళ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు చట్టంలో పలు మార్పులు చేస్తూ ఆర్డినెన్సు జారీ చేయగా గవర్నర్ కూడా దానికి ఆమోదముద్ర వేశారు. సోషల్ మీడియాను కూడా పోలీసుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. యూట్యూబ్ చానళ్లతో పాటు పలు సోషల్ మీడియా వేదికల ద్వారా తమను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ కొంత మంది మహిళలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
వీటిని అడ్డుకునేందుకు సరైన చట్టం లేకపోవడంతో, ఇటువంటి కేసులు మరిన్ని పెరగవచ్చునని భావించిన కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం …చట్టంలో సవరణలు చేయాలన్న ప్రతిపాదనకు వచ్చింది. దీనికి సంబంధించి కేరళ పోలీసు చట్టంలో సవరణలు చేసి..గవర్నర్‌కు పంపగా.. ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
దీంతో కేరళ పోలీస్ చట్టంలోని సెక్షన్ 118 (ఎ) ప్రకారం.. ఏ వ్యక్తి అయినా మరొకరిని ఉద్దేశించి సోషల్ మీడియా ద్వారా బెదిరింపులకు లేదా కించపరిచేలా పోస్టులు చేస్తే.. దాన్ని నేరంగా పరిగణిస్తారు. అభ్యంతరకరంగా ఉండేలా వ్యాఖ్యలు లేదా సమాచారాన్ని ఏ సామాజిక మాధ్యమం ద్వారా అయినా ఫలానా వ్యక్తికి పంపించడం చట్ట వ్యతిరేకమౌతుంది. ఆ పోస్టు తీవ్రతను బట్టి 10 వేల రూపాయల జరినామా లేదా అయిదేళ్ల జైలుశిక్ష లేదా ఈ రెండింటినీ కలిపి విధించనున్నట్లు పేర్కొన విషయం తెలిసిందే.
అయితే, దీనిపై అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలతో పాటు భాగస్వామ్య పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో విజయన్ సర్కార్ కొత్త చట్టాన్ని ఉపసంహరించుకుంది. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం స్వేచ్ఛను కాలరాస్తోందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.