Jamili Elections Bill : వన్ నేషన్ – వన్ ఎలక్షన్.. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Jamili Elections 2024 : ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Jamili Elections cabinet approves
Jamili Elections Bill : “వన్ నేషన్ – వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికల)” బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. 18,000 పేజీల కోవింద్ నివేదిక ఆధారంగా రూపొందించిన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ మేరకు పార్లమెంట్‌లో జమిలి ఎన్నికల బిల్లు పెట్టేందుకు కేంద్రం రెడీ అయింది.
జమిలి ఎన్నికలకు సంబంధించి గతంలోనే కోవింద్ కమిటీ సిఫార్సులు ఇవ్వగా కేబినెట్ ఆమోద్రముద్ర వేసింది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నదే ఈ జమిలి బిల్లు లక్ష్యంగా చెప్పవచ్చు.
పార్లమెంట్, అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు సైతం కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా బిల్లును ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే, జమిలి ఎన్నికలను 30కు పైగా పార్టీలు సమర్థించగా, కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఈ విషయంలో ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ వ్యతిరేకించింది.
గతంలో జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయడంతో తాజాగా కేంద్ర కేబినెట్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ముసాయిదా బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టనుంది.
1951 నుంచి 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికల నుంచి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాతి కాలంలో సుస్థిర ప్రభుత్వాలు లేకపోవడం, గడువుకు ముందే రాష్ట్రాల అసెంబ్లీలను బర్తరఫ్ చేయడంతో జమిలి ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోయింది. అప్పటినుంచి లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు వేరుగా నిర్వహిస్తున్నారు. జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే.. 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు తప్పనిసరిగా కోవింద్ కమిటీ ప్రతిపాదించింది.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 79వ నివేదికలో జమిలి ఎన్నికలకు అనుకూలంగా సిఫార్సులు చేసింది. వాటిలో ముఖ్యంగా ఆర్టికల్ 83 (పార్లమెంట్ వ్యవధి గురించి చెప్పే ఆర్టికల్), ఆర్టికల్ 172 (రాష్ట్రాల అసెంబ్లీల వ్యవధి)ను సవరించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలను కలిపి నిర్వహించాలంటే ఆర్టికల్ 324(ఏ), ఆర్టికల్ 325ను సవరించాల్సిన అవసరం ఉంది.
వచ్చే 2029లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కమిటీ ప్రతిపాదనలు చేసింది. ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను ఉపయోగించబోతున్నారు.
Read Also : Rashmika Mandanna : అల్లు అర్జున్ దమ్మున్న హీరో.. ఆ సీన్ మరే హీరో చెయ్యలేడు.. బన్నీ పై రష్మిక కామెంట్స్..