Amit Shah: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. విమాన ప్రమాద ఘటన అత్యంత బాధాకరం అన్నారు. విమాన ప్రమాదంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైందన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మరణించారని ఆయన చెప్పారు. ప్రమాద సమయంలో ఫ్లైట్ లో 242 మంది ఉన్నారని తెలిపారు. అందులో 230 మంది ప్రయాణికులు కాగా, 12మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు.
విమాన దుర్ఘటన నుంచి ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అమిత్ షా తెలిపారు. ఘటనా స్థలంలో మృతదేహాల వెలికితీత దాదాపుగా పూర్తైందన్నారు. మృతులను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నామన్నారు. మృతుల కుటుంబాల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ ను సేకరించాల్సి ఉందన్నారు. డీఎన్ఏ టెస్టుల తర్వాత మృతుల సంఖ్య, వారి వివరాలు ప్రకటిస్తామన్నారు.
మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారని, వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చామని చెప్పారు. సుమారుగా వెయ్యి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉందన్నారు అమిత్ షా. డీఎన్ ఏ పరీక్షలు పూర్తయ్యాకే మృతదేహాలను అప్పగిస్తామని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని అమిత్ షా తెలిపారు. విమానం దాదాపు లక్ష 25వేల లీటర్ల ఇంధనాన్ని మోసుకెళ్లిందని, విమానం పేలిన వెంటనే మంటలు చెలరేగి అధిక ఉష్ణోగ్రత వెలువడిన కారణంగా ఎవరినీ రక్షించే అవకాశం లేకుండా పోయిందన్నారు. విమానం పేలిపోవడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశమే లేకుండా పోయిందన్నారు.