Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా.. బండి సంజయ్ ఏమన్నారంటే..?

మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి రద్దు అయ్యింది. దీంతో తెలంగాణ బీజేపీ క్యాడర్ అయోమయంలో పడ్డారు.

Union Minister Amit Shah

Union Minister Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన (Telangana Tour ) మరోసారి వాయిదా పడింది. అరేబియా మహాసముద్రం (Arabian Sea)లో ఏర్పడిన బిపర్‌జాయ్ తుఫాన్ (Cyclone Biparjoy) ప్రభావంతో తెలంగాణ పర్యటనను అమిత్ షా వాయిదా వేసుకున్నారు. గత ఆరు నెలల్లో అమిత్ షా షా తెలంగాణ పర్యటన మూడు సార్లు రద్దు అయ్యింది. ఈసారి పక్కాగా జరుగుతుందనుకునే సమయంలో నాలుగోసారి కూడా రద్దు కావటంతో తెలంగాణ బీజేపీ క్యాడర్ నిరుత్సాహానికి గురి అవుతున్నట్లుగా తెలుస్తోంది.

బిపర్‌జాయ్ తుపాను తీవ్ర రూపం దాల్చటంతో దీనిపై ఉన్నత స్థాయి సమీక్షలు, అధికార యంత్రాంగంతో నిరంతం అందుబాటులో ఉండి సహాయక చర్యల ఆదేశాలకు రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో అమిత్ షా ఆ పనుల్లో బిజీగా ఉండాల్సి రావటంతో తెలంగాణ పర్యటన మరోసారి రద్దు అయ్యింది. తెలంగాణ పర్యటనలో భాగంగా నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో ఆయన సమావేశం కావాల్సి ఉంది. ప్రముఖ సినీ దర్భకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ తో కూడా సమావేశం కావాలని భావించారు. కానీ పర్యటన రద్దుతో ఈ సమావేశాలు కూడా క్యాన్సిల్ కానున్నట్లుగా తెలుస్తోంది. టూర్ షెడ్యూల్ ప్రకారం షా బుధవారం అర్ధరాత్రికి హైదరాబాద్ రావాల్సి వుంది.

Also Read: రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కేసీఆర్ సన్నిహితుడు శ్రీహరిరావు

పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా మంచిర్యాల పర్యటన, సంగారెడ్డిలో మేధావులతో జరగాల్సిన అమిత్ షా సమావేశం చివరి నిమిషంలో రద్దు అయ్యింది. అలాగే మే 27న యోగా దినోత్సవ సన్నాహకా సభను ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు షా. తాజాగా తుఫాన్ కారణంగా రేపటి ఖమ్మం సభ కూడా రద్దు అయ్యింది. ఇలా తెలంగాణలో అమిత్ షా పర్యటనల వరుస రద్దుతో బీజేపీ క్యాడర్ అయోమయంలో పడింది. ఈ క్రమంలో షా మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తారా, వస్తే ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.

అందుకే వాయిదా: బండి సంజయ్
రేపటి ఖమ్మం బహిరంగ సభ వాయిదా వేశామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో సైక్లోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అమిత్ షా పర్యటన వాయిదా పడిందని చెప్పారు. తుఫాన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో సభ వద్దనుకుని వాయిదా వేశామని వెల్లడించారు. కార్యకర్తలు నిరాశ చెందవద్దని, త్వరలో భారీ బహిరంగ సభ కచ్చితంగా నిర్వహిస్తామన్నారు. నాగర్ కర్నూల్ నడ్డా సభ యథావిధిగా ఉంటుందని, ప్రధాని మోదీ టూర్ ఎప్పుడు అన్న అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని చెప్పారు.

 

 

ట్రెండింగ్ వార్తలు