తవ్వకాల్లో బైటపడ్డ కుషాణుల కాలంనాటి నాణాలు, విగ్రహాలు

  • Published By: nagamani ,Published On : December 14, 2020 / 11:23 AM IST
తవ్వకాల్లో బైటపడ్డ కుషాణుల కాలంనాటి నాణాలు, విగ్రహాలు

Updated On : December 14, 2020 / 11:52 AM IST

UP Mau district Ancient 150 coins in excavations : ఉత్తరప్రదేశ్ లోని స్థానికులకు పురాతన కాలం నాటి నాణాలు, కొన్ని విగ్రహాలు దొరికాయి. ఈ విషయం ఆనోటా ఈనోటా అధికారులకు తెలియటంతో వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షలకు పంపించగా అవి కుషాణుల కాలంనాటివని తేలింది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేలో సిక్స్‌లేన్ నిర్మాణం కోసం జరుపుతున్న తవ్వకాల్లో ఇవి బైటపడ్డాయి.

వివరాల్లోకి వెళితే..యూపీలోని మవూ జిల్లాలోని ముహమ్మదాబాద్ గోహనా పరిధిలోని మహ్పుర్ కు కొంత దూరంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేలో సిక్స్‌లేన్ నిర్మాణం జరుగుతోంది. దీనికి సంబంధించి తవ్వకాల పనులు జరుగుతున్నాయి. ఈ తవ్వకాల్లో కొన్ని పురాతన నాణాలు, విగ్రహాలు బయటపడ్డాయి.

ఈ విషయం స్థానికంగా సంచలనం కలిగించింది. సమీపంలోని గ్రామస్తులు భారీగా తరలివచ్చిన జనాలు ఆ ప్రాంతానికి చేరుకుని వెతకగా వారికి కొన్ని నాణాలు దొరకగా వాటిని తీసుకుని పోయారు. ఇదే విషయాన్ని కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గ్రామస్తుల నుంచి 150 నాణాలను, విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ సింగ్ బన్సాల్ గ్రామానికి చేరుకున్నారు. 150కిపైగా విలువైన నాణాలను, విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పురాతత్వ పరిశోధకుల వద్దకు తరలించారు.

వాటిని పరిశీలించిన ప్రముఖ పరిశోధకులు సుభాష్ యాదవ్ మాట్లాడుతూ..ఈ నాణాలు, విగ్రహాలు కుషాణుల కాలానికి చెందినవని తెలిపారు. కాగా ఆ ప్రాంతంలో పురాతన కాలంనాటివి బైటపడుతుండటంతో అవి స్థానికుల చేతికి వెళ్లిపోతాయని భావించిన అధికారులు తవ్వకాలు నిలిపివేశారు.