యూపీలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే దొరికాడు. గురువారం(జూలై 9,2020) పోలీసులు వికాస్‌ను అరెస్ట్ చేశారు. వారం రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వికాస్ దూబేని యూపీ పోలీసులు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాన్పూర్ లో 8మంది పోలీసులను కాల్చి చంపిన కేసులో వికాస్ దూబే ప్రధాన నిందితుడు. ఆ ఘటన తర్వాత వికాస్ దూబే తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి కోసం తీవ్రంగా గాలించిన యూపీ పోలీసులు చివరికి సక్సెస్ అయ్యారు. కాగా, ఇప్పటికే వికాస్ దూబే ముగ్గురు ప్రధాన అనుచరులను పోలీసులు హతం చేశారు. నిన్న(జూలై 8,2020) వికాస్ దూబే రైట్ హ్యాండ్ అమర్ దూబేని ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు ఇవాళ(జూలై 9,2020) మరో ఇద్దరు అనుచరులను చంపేశారు. వికాస్ దూబేపై పోలీసులు 5లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
8మంది పోలీసులను పొట్టన పెట్టుకున్నారు:
జూలై 3వ తేదీన బిక్రూ గ్రామంలో వికాస్ దూబేని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో వికాస్ దూబే గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 8మంది పోలీసుల చనిపోయారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. యూపీ ప్రభుత్వం, పోలీసులు ఉన్నతాధికారులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. ప్రతీకారంతో రగిలిపోయారు. పోలీసులను హతమార్చి పారిపోయిన వికాస్ దూబే కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఏకంగా 40 పోలీసు బృందాలు రంగంలోకి దిగి వికాస్ కోసం వేటాడాయి. పొరుగు రాష్ట్రాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. వికాస్ దూబే చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. చివరికి ఉజ్జయినిలో దొరికిపోయాడు.
వికాస్ దూబే ఇద్దరు అనుచరులు హతం:
వికాస్‌దూబే మరో ఇద్దరు అనుచరులను యూపీ పోలీసులు గురువారం(జూలై 9,2020) వేర్వేరు చోట్ల ఎన్ కౌంటర్ చేశారు. వికాస్ సన్నిహిత అనుచరుడు ప్రవీణ్ అలియాస్ బవువా దూబేను కాల్చి చంపారు. 8మంది పోలీసులను చంపి పరారీలో ఉన్న వికాస్ దూబేతోపాటు అతని ముఠా సభ్యుల కోసం యూపీ ప్రత్యేక పోలీసులు గాలిస్తున్న సమయంలో ఇటావా పట్టణంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికాస్ దూబేకు సన్నిహిత అనుచరుడైన బవువా దూబే హతమయ్యాడు.
పోలీసుల ఎదురుకాల్పుల్లో హతం:
ఇటావా పట్టణ సమీపంలోని బాకేవార్ పోలీస్ స్టేషన్ పరిధి మహీవా దగ్గర జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున 3 గంటలకు స్పార్పియోలో వచ్చిన నలుగురు సాయుధులు స్విఫ్ట్ డిజైర్ కారును చోరీ చేసి పారిపోతుండగా పోలీసులు వారిని కచురా రోడ్డు దగ్గర అడ్డుకున్నారు. దీంతో వేగంగా వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు చెట్టును ఢీకొట్టింది. అనంతరం కారులో వారు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించారు. మరణించింది ప్రవీణ్ అలియాస్ బవువా దూబే అని తేలింది. మృతుడి నుంచి ఒక పిస్టల్, మరో డబుల్ బ్యారల్ గన్, తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు ముఠా సభ్యులు స్కార్పియోలో పారిపోయారు. పారిపోయిన ముఠా సభ్యుల కోసం సమీప జిల్లాల్లో గాలింపు ముమ్మరం చేశామని ఈటావా ఎస్పీ ఆకాష్ తోమర్ చెప్పారు.
తప్పించుకునే ప్రయత్నంలో ఎన్‌కౌంటర్:
వికాస్ దూబే మరో అనుచరుడు ప్రభాత్ మిశ్రాను కాన్పూర్ దగ్గర పోలీసులు కాల్చి చంపారు. పోలీసుల కస్టడీ నుంచి పారిపోతుండగా జరిపిన కాల్పుల్లో ప్రభాత్ మిశ్రా హతమయ్యాడు. ప్రభాత్ మిశ్రాను బుధవారం పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు తరలిస్తుండగా అతను పారిపోయేందుకు యత్నించాడు. ప్రభాత్ మిశ్రాను కారులో కాన్పూరుకు తరలిస్తుండగా పంకీ దగ్గర కారు టైరుకు పంక్చర్ అయింది. దీంతో ప్రభాత్ పోలీసు నుంచి పిస్టల్ లాక్కొని కాల్పులు జరిపాడని, తాము ఎదురుకాల్పులు జరిపామని, ఈ కాల్పుల్లో ప్రభాత్ మరణించాడని పోలీసులు వెల్లడించారు.