ట్వీట్ డిలీట్ చేసిన క‌పిల్ సిబ‌ల్‌…రాహుల్ యూట‌ర్న్‌

23 మంది సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు సోనియా గాంధీ నాయ‌క‌త్వాన్ని ప్ర‌శ్నిస్తూ రాసిన లేఖ ఆ పార్టీలో అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇవాళ జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో కాంగ్రెస్ స‌భ్యులు రెండు వ‌ర్గాలుగా చీలిపోయాయి. బీజేపీతో కుమ్మ‌క్కు అయిన సీనియ‌ర్లు త‌న త‌ల్లిని క్షోభ‌కు గురిచేసిన‌ట్లు రాహుల్ ఆరోపించిన విష‌యం తెలిసిందే.

అయితే రాహుల్ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ సీనియ‌ర్ నేత క‌పిల్ సిబ‌ల్ ఓ ట్వీట్ చేశారు. 30 ఏళ్ల‌లో ఏనాడూ బీజేపీని స‌మ‌ర్థిస్తూ తాను మాట్లాడ‌లేద‌ని సిబ‌ల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్య‌లు బాధ‌పెట్టిన‌ట్లు క‌పిల్ కామెంట్ చేశారు.

మ‌రో సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ కూడా రాహుల్ వ్యాఖ్య‌ల‌పై సీరియ‌స్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో క‌పిల్ సిబ‌ల్‌తో రాహుల్ మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. త‌న కామెంట్ల‌పై రాహుల్ గాంధీ యూట‌ర్న్ తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. రాహుల్ త‌న‌తో వ్య‌క్తిగ‌తంగా మాట్లాడాడు అని, త‌న గురించి అలా మాట్లాడ‌లేద‌ని రాహుల్ త‌న‌తో చెప్పిన‌ట్లు క‌పిల్ సిబ‌ల్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో త‌న ట్వీట్‌ను డిలీట్ చేస్తున్న‌ట్లు క‌పిల్ తెలిపారు.