Site icon 10TV Telugu

Trump Tariff: భారత్ పై మరోసారి టారిఫ్ మోత మోగించిన ట్రంప్.. 50శాతం సుంకాలు వీటిపైనే..

PM Modi Donald Trump

PM Modi Donald Trump

Donald Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. భారత్ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ టారిఫ్ బాంబ్ పేల్చేశారు. మరోసారి ఇండియాపై టారిఫ్‌లు విధించారు. ఇండియాపై 25శాతం అదనపు టారిఫ్‌లు విధించారు ట్రంప్. ఇప్పటికే 25శాతం టారిఫ్ ఉండగా, తాజా పెంపుతో భారత్ పై ట్రంప్ విధించిన టారిఫ్‌ల శాతం 50శాతానికి పెరిగింది. పెంచిన టారిఫ్‌లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ సుంకాలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమెరికా అదనపు సుంకాలు సహేతుకం కాదని భారత్ అభిప్రాయపడింది. ఇది అనుచితం, అన్యాయం, అహేతుకం అని స్పష్టం చేసింది. ఈ విషయంలో దేశ ప్రయోజనాలకు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బుధవారం విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

భారత్ పై అమెరికా బుధవారం ప్రకటించిన ఈ అదనపు 25శాతం టారిఫ్ ను వెంటనే వర్తింపజేయబోమని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన 21రోజుల తరువాత అదనపు 25శాతం భారతీయ ఉత్పత్తులపై వర్తింపజేస్తారు. ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన సరుకుపై ఈ అదనపు 25శాతం సుంకాన్ని విధించబోరు. అదేవిధంగా బుధవారం అర్ధరాత్రిలోపు అమెరికా చేరుకునే ఉత్పత్తులపైనా ఈ అదనపు భారం ఉండదు. సెప్టెంబర్ 17వ తేదీ అర్థరాత్రిలోపు అమెరికాలో మార్కెట్లోకి వచ్చేసిన భారతీయ ఉత్పత్తులపై ఈ అదనపు వడ్డింపు ఉండదు.

ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత్‌ చేసే 86 బిలియన్‌ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడనుంది. ట్రంప్ తాజా నిర్ణయం వల్ల భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతి సంక్షోభంలో పడనుంది. దుస్తులు, వజ్రాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు), తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు సంబంధ ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్ పరికరాలు, యంత్ర సామాగ్రి ఎగమతులపై అదనపు టారిఫ్ భారం ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, ఔషధాలు, ఇంధన ఉత్పత్తులైన క్రూడాయిల్, రిఫైన్డ్ ఇంధనం, సహజ వాయువు, బొగ్గు, విద్యుత్‌తో పాటు కీలక ఖనిజాలు, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు, డ్రైవ్‌లు, ప్యానల్ బోర్డులు, సర్క్యూట్లు తదితర వాటిపై ప్రస్తుతానికి ఉపశమనం ఉంటుందని తెలుస్తుంది.

Exit mobile version