కొత్త రకం కరోనాపై ప్రస్తుత వ్యాక్సిన్లు పనిచేస్తాయి

Vaccines will work against the variants detected in UK and South Africa కొత్త ర‌కం క‌రోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్న విష‌యం తెలిసిందే. భారత్ లో కూడా కొత్త రకం కేసులు న‌మోదయ్యాయి. అయితే ఆ వేరియంట్ క‌న్నా మ‌రింత ప్రాణాంత‌కమైన క‌రోనా ర‌కాలు ఇండియాలోనూ మ్యుటేష‌న్‌ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు నీతి ఆయోగ్ స‌భ్యుడు వీకే పౌల్ మంగళవారం(డిసెంబర్-29,2020) ఢిల్లీలో మీడియాతో తెలిపారు. అనేక దేశాల‌తో పాటు భారత్ కు కూడా యూకే వేరియంట్ పాకింద‌ని…దేశంలో ఇంకా మెజరిటీ ప్రజలకు వైరస్ ముప్పు పొంచి ఉందని…తీవ్ర‌మైన చ‌లిలోనూ చాలా మందికి కొత్త ర‌కం క‌రోనా ఇన్‌ఫెక్ష‌న్ సోకుతుంద‌ని అర్థమ‌వుతోంద‌ని.. ఎవ‌రూ కూడా అజాగ్ర‌త్త‌గా ఉండ‌రాదని వీకే పౌల్ హెచ్చ‌రించారు.

కాగా, ప్రస్తుతం అభివృద్ది చేస్తున్న కరోనా వ్యాక్సిన్లు.. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో గుర్తించిన కరోనా కొత్త రకం కరోనాపై కూడా పని చేస్తాయని కేంద్ర ప్రధాన శాస్త్రీయ సలహాదారు(PSA) ప్రొఫెసర్​ కే విజయ​ రాఘవన్ తెలిపారు. ఈ కోవిడ్-19 వైరస్ వేరియంట్స్ పై ప్రస్తుత వ్యాక్సిన్లు ప్రభావం చూపవని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని మంగళవారం(డిసెంబర్-29,2020)రాఘవన్ తెలిపారు.

మరోవైపు, భారత్​లో కరోనా జన్యుక్రమాలను గుర్తించేందుకు 10 ప్రభుత్వ ప్రయోగశాలలతో జినోమిక్స్​ కన్సార్టియం ఏర్పాటు చేయడం కీలక పరిణామమని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్​ అన్నారు. బ్రిటన్ లో కొత్త రకం కరోనా స్ట్రెయిన్​ వ్యాప్తి గురించి తెలిసే నాటికి భారత్​లో 5వేల జినోమీ సీక్వెన్స్​ పరీక్షలే చేశామని, కన్సార్టియం ఏర్పాటుతో ఆ సంఖ్య ఇప్పుడు మరింత పెరుగుతుందన్నారు.

దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2.7లక్షల దిగువకు చేరిందని భూషణ్​ వెల్లడించారు. పాజిటివిటీ రేటు కూడా గతవారం 2.25శాతంగానే నమోదైనట్లు చెప్పారు. లింగ ఆధారంగా కొవిడ్​ కేసుల సంఖ్యను విశ్లేషిస్తే వైరస్​ సోకిన వారిలో 63 శాతం మంది పురుషులు, 37 శాతం మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక వ‌య‌సు ఆధారంగా ప‌రిశీలిస్తే, 17 ఏళ్ల లోపు వారిలో 8 శాతం కేసులు, 18 నుంచి 25 ఏళ్ల వారిలో 13 శాతం కేసులు, 26 నుంచి 44 ఏళ్ల వ‌య‌సువారిలో 39 శాతం కేసులు, 45 నుంచి 60 ఏళ్ల వారిలో 26 శాతం కేసులు, 60 ఏళ్లు దాటిన వారిలో 14 శాతం పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు తెలిపారు. దేశంలో కరోనా కొత్త కేసులు 6నెలల తర్వాత 17వేల కంటే తక్కువగా నమోదయ్యాయని, మరణాలు కూడా 300లోపే వెలుగు చూశాయన్నారు.

ఇక, వైర‌స్ వ్యాధి నిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై అతిగా ఒ‌త్తిడి తీసుకురావ‌ద్దు అని ఐసీఎంఆర్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ బ‌ల‌రామ్ భార్గ‌వ్ తెలిపారు. ర‌క‌ర‌కాల చికిత్సా విధానాల చాలా న్యాయ‌మైన రీతిలో అమ‌లు చేయాల‌న్నారు. కేవ‌లం మ‌నకు లాభం చేసే చికిత్సా విధానాల‌కు మాత్రం ఓకే చెప్పాల‌న్నారు. అయితే ఏదైనా చికిత్స ద్వారా లాభం జ‌ర‌గ‌ని ప‌క్షంలో అప్పుడు అలాంటి విధానాల‌ను వాడ‌వ‌ద్దు అన్నారు. లేని ప‌క్షంలో వైర‌స్‌పై వ‌త్తిడి పెరుగుతుంద‌ని, దాని ద్వారా వైర‌స్ తీవ్ర స్థాయిలో మ్యుటేష‌న్ జ‌రిగే అవ‌కాశం ఉంటుందని భార్గవ్ తెలిపారు.