Vice Presidential Election 2025 (1)
Vice Presidential Election 2025 : ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బరిలో నిలిచారు. తాజాగా.. ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుత తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. (Vice Presidential Election 2025)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన ముఖ్యనేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం సుదర్శన్ రెడ్డి పేరును ఉపరాష్ట్ర పతి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, తొలుత మాజీ ఇస్రో శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురై, మహాత్మా గాంధీ మునిమనవడు, రచయిత తుషార్ గాంధీ పేర్లు కూడా ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కూటమిలోని ముఖ్యనేతలు సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించిన ఎన్డీయే.. ఆ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే, ఇండియా కూటమి అభ్యర్థిని బరిలో నిలపడంతో.. రాధాకృష్ణన్, జస్టిస్ బి. సుందర్శన్ రెడ్డిల మధ్య పోటీ అనివార్యమైంది.
లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్డీయే కూటమి సభ్యుల బలాన్ని బట్టిచూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సీపీ రాధాకృష్ణన్ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉపరాష్ట్రపతిని లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఖాళీలను మినహాయించి, ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో 782 మంది సభ్యులు ఉన్నారు. అంటే.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విజయం సాధించాలంటే గెలిచే పక్షానికి కనీసం 392 ఓట్లు ఉండాలి.
ఎన్డీయే కూటమికి లోక్ సభలో 293 మంది, రాజ్యసభలో 133 మంది సభ్యులు ఉన్నారు. దీంతో ఎన్డీయేకు మొత్తం 426 సభ్యుల బలం ఉంది.. ఈ సంఖ్యలను బట్టిచూస్తే ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఎన్డీయే కూటమిలోని సభ్యులు రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా కూటమిలోని అభ్యర్థికి ఓటువేస్తే సుదర్శన్ రెడ్డి విజయం సాధ్యమవుతుంది. అయితే, అలా జరగడం అసాధ్యమనే చెప్పొచ్చు. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తికాగా.. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి. ఇద్దరూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు.