Mizoram Perfectly Streamlined Traffic
Mizoram Perfectly Streamlined Traffic : హైదరాబాద్ సిటీతో పాటు భారత్ లోని పలు మెట్రో నగరాల్లో వాహనంతో బయటకు వచ్చామంటే చాలు ట్రాఫిక్ లో ఇరుక్కోవాల్సిందే. ఆఫీసుకు సమయానికి చేరుకుంటామో లేదో తెలియని పరిస్థితి. పనులు చక్కబెట్టుకున్నాక ఇంటికి తిరిగి ఎన్నింటికి వెళతామో మన చేతుల్లో ఉండదు. దీనికి కారణం ట్రాఫిక్..ట్రాఫిక్..ట్రాఫిక్. ఇన్ని సమస్యలకు ట్రాఫిక్కే కారణమనే అందరు అనుకుంటారు. కానీ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం కూడా ట్రాఫిక్ జామ్ లకు కారణం అని ఎవరైనా ఆలోచిస్తారా? అబ్బే అటువంటిదేం లేదు. ఎవరి కంగారు వారిది..ఎవరి పనుల హడావిడి వారిది. అందుకే పక్కనున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసి వెళ్లిపోదామనే కంగారు. వెరసీ ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేస్తాం. కాస్త సంయమనం పాటిస్తే అందరు చక్కగా వెళ్లొచ్చు. అది ఇరుకు గల్లీల్లో గానీ..లేదా పెద్ద రహదారుల్లో గానీ..అదే పాటిస్తున్నారు మిజోరాం రాజధాని ఐజ్వాల్ సిటీలో.
మిజోరాంలోని ఐజ్వాల్‌లో బారులుతీరిన వాహనాలు క్రమ పద్ధతిలో వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రమబద్ధీకరించిన ట్రాఫిక్‌ను చూసిన నెటిజన్లు ఐజ్వాల్ ఇండియన్ సైలెంట్ సిటీ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇలా అందరు చక్కటి క్రమశిక్షణ పాటిస్తే ఎవ్వరికి ఎటువంటి (ట్రాఫిక్ ఇబ్బందులు)ఇబ్బందులు ఉండవని కచ్చితంగా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే..
మిజోరాంలోని ఐజ్వాల్ సిటీలో ఓ ఇరుకు వీధిలో వాహనదారులు ఎంత క్రమశిక్షణగా వెళుతున్నారో చూస్తే భలే ముచ్చటేస్తోంది. ట్రావెల్ బ్లాగర్ ఎలిజబెత్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఇరుకైన రోడ్‌పైనే కార్లు, బైక్‌లు చక్కగా ఓ క్రమపద్ధతిలో వెళుతుండటం కనిపిస్తోంది. కార్లు, బైక్‌లు వేర్వేర్లు లేన్స్‌పై వెళుతుండటం చూడొచ్చు. ఏ వాహనం మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించకపోవడం ముఖ్యంగా ఈ వీడియోలో గమనించాల్సిన విషయం.
ఐజ్వాల్‌లో ఇక్కడ ప్రతిఒక్కరూ తమ వంతు వచ్చే వరకూ సహనంతో వేచిచూస్తారు..ప్రతి భారత నగరంలోనూ దీన్ని పాటించడం మేలని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు యూజర్. ఈ వీడియోకు ఇప్పటివరకూ 2.6 లక్షల లైక్స్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు స్పందించారు. ట్రాఫిక్ జామ్స్‌ను నివారించేందుకు భారతీయ నగరాలన్నీ ఈ ట్రాఫిక్ మోడల్‌ను అనుసరించాలని సూచిస్తున్నారు.ఇలాగే అందరు నిబంధనలు పాటిస్తే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.