లడఖ్‌లోని భారత్ -చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించారు. 43 మంది చైనా సైనికులు కూడా మరణించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి.
చైనా దేశం మాత్రం ఇప్పటి వరకు తమ సైనికులు ఎంతమంది చనిపోయారో అధికారికంగా ప్రకటించలేదు. గల్వాన్ ఘటన తర్వాత ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల వైరంపై గల్వాన్ మనవడు అమీన్ గల్వాన్ స్పందించారు.
ఇరుదేశాలు సంయమనం పాటించి.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. 200 ఏళ్లుగా ఈ ప్రాంతం తమకు చెందినదని, యుద్ధం పరిష్కారం కాదని, కూర్చొని మాట్లాడుకోవాలన్నారు అమీన్ గల్వాన్.
లడఖ్ కు తూర్పు ప్రాంతంలో గల్వాన్ లోయ ఉంది. 80 కి.మీ. పొడవైన గల్వాన్ నది వివాదాస్పదమైన అక్సాయ్ చిన్ ప్రాంతం నుండి భారతదేశంలోని లడఖ్ కు ప్రవహిస్తుంది. ప్రముఖ సాహసికుడు గులాం రసూల్ గల్వాన్ పేరు మీదుగా ఈ లోయ, నదికి ఆ పేరు వచ్చింది. లడఖ్ కు చెందిన గులాం రసూల్ గల్వాన్ అక్కడి కొండ, కోనల్లో ఎన్నో సాహస యాత్రలు చేశారు. లడఖ్ అందాలను ప్రపంచానికి పరిచయం చేశారు. 19వ శతాబ్ధంలో ఎంతో మంది యూరోపియన్ టూరిస్టులు, సాహసికులు లడఖ్ ప్రాంతంలో పర్యటించడంలో సాయం చేశారు.