Priyanka Gandhi: వయనాడ్‌లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటర్లకు ప్రియాంక గాంధీ కీలక విజ్ఞప్తి

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ స్థానంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉదయం ఓటింగ్ ప్రారంభమైంది.

Priyanka Gandhi

Bypolls 2024 Wayanad Lok Sabha: దేశంలోని 10 రాష్ట్రాల్లో ఇవాళ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఇందులో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ స్థానంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉదయం ఓటింగ్ ప్రారంభమైంది. వయనాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆరు, అస్సాంలో ఐదు, బీహార్ లో నాలుగు, కర్ణాటక రాష్ట్రంలో మూడు, మధ్యప్రదేశ్ లో రెండు, ఛత్తీస్ గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయ రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికనున్నాయి.

Also Read: Jharkhand Election 2024: ఝార్ఖండ్‌లో కొనసాగుతున్న తొలివిడత పోలింగ్.. ఓటర్లకు గర్నవర్ కీలక విజ్ఞప్తి

అందరి దృష్టి వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలోకి దిగడం ఇదే తొలిసారి. వయనాడ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినప్పటికీ.. ప్రియాంక గాంధీకి ఇక్కడ ఎదురు గాలి వీస్తుందని ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎల్డీఎఫ్ అభ్యర్ధి సత్యన్ మొకేరి, బీజేపీ నుంచి నవ్య హరిదాస్ తో పాటు మరో 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ 3,64,422 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా.. 2019లో నాలుగు లక్షలకుపైగా ఓట్లతో రాహుల్ విజయం సాధించాడు.

 

వయనాడ్ లో ఉప ఎన్నిక సందర్భంగా ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ‘నా ప్రియమైన సోదరీమణులు, సోదరులారా. దయచేసి ఈరోజు ఓటు వేయండి. ఇది మీ రోజు. మీరు మీ ఎంపిక చేసుకోవడానికి, మన రాజ్యాంగం మీకు అందించిన గొప్ప అధికారాన్ని ఉపయోగించుకునే రోజు. మంచి భవిష్యత్తును నిర్మించుకుందాం.’ అంటూ ప్రియాంక ఎక్స్ లో పోస్టు చేశారు.