వయనాడ్‌లో మాటలకందని మహా విషాదం.. ఎటు చూసినా విధ్వంసం జాడలు.. భీతావాహ దృశ్యాలు

విరిగిపడిన కొండచరియలు, నేలమట్టమైన ఇళ్లు, బురదలో కూరుకుపోయిన బాధితుల హాహాకారాలతో వయనాడ్‌ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్మల ప్రాంతాలు భీతిల్లుతున్నాయి.

Wayanad Landslides Tragedy:  కేరళలోని వయనాడ్ జిల్లాలో జల విలయం సృష్టించిన మహా ఉత్పాతం మాటలకందని విషాదాన్ని మిగిల్చింది. ఎటు చూసినా విధ్వంసం జాడలు కనిపిస్తున్నాయి. విరిగిపడిన కొండచరియలు, నేలమట్టమైన ఇళ్లు, బురదలో కూరుకుపోయిన బాధితుల హాహాకారాలతో వయనాడ్‌ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్మల ప్రాంతాలు భీతిల్లుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 108కి చేరుకుంది. 120 మంది క్షతగాత్రులయ్యారు. మరో వంద మంది వరకు గల్లంతయ్యారు.

కొట్టుకుపోయిన సహాయక శిబిరం
భారీ వరదలతో తొలుత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బురదలో ఇళ్లు, దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. గాఢనిద్రలో ఉన్నవారంతా శిథిలాల కింద సజీవ సమాధి అయ్యారు. చాలా మంది క్షతగాత్రులయ్యారు. బాధితులను సమీపంలోని చురల్మల స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి రెస్క్యూ టీమ్ తరలించారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ స్కూల్ సమీపంలో మరోసారి కొండచరియలు విరిగిపడడంతో సహాయక శిబిరం సహా చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కొట్టుకుపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం బాధితుల ఆర్తనాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

మధ్యాహ్నం మరోసారి విలయం
బాధితులను కాపాడేందుకు NDRF, KSDRF, ఆర్మీ, నావి, ఎయిర్ ఫోర్స్, అగ్నిమాపక దళాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం సహాయ చర్యలకు అంతరాయం కలిగిస్తోంది. ముండకైలో మధ్యాహ్నం మరోసారి కొండచరియలు విరిగిపడడంతో ఆ ప్రాంతంలో మరింత విధ్వంసం జరిగింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం డ్రోన్లు, జాగిలాలతో సహాయక బృందాలు గాలిస్తున్నాయి. వయనాడ్ విపత్తు నేపథ్యంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు కేరళ ప్రభుత్వం సంతాపదినాలు ప్రకటించింది.

కేరళ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నాయకులు ఫోన్‌లో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో అన్నివిధాలుగా అండగా నిలుస్తామని భరోసాయిచ్చారు. బాధితుల కోసం వయనాడ్‌లో 45, రాష్ట్రవ్యాప్తంగా 118 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కేరళ సీఎం తెలిపారు. ఇప్పటివరకు 3,069 మందిని సహాయక శిబిరాలకు తరలించినట్టు చెప్పారు. చురల్మల మసీదులో తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని కేరళ హెల్త్ మినిస్టర్ కార్యాలయం వెల్లడించింది. కేరళకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఆపన్న హస్తం అందించాయి.

Also Read: వయనాడ్‌లో జల విలయం.. 600 మంది వలస కార్మికులు గల్లంతు.. ఆచూకీపై ఆందోళన

ట్రెండింగ్ వార్తలు