మరోసారి తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉంటాం: సుప్రీంకోర్టుకు తెలిపిన రామ్‌దేవ్ బాబా

కోర్టు ఇచ్చిన గత ఉత్తర్వుల్లో ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదు మీరు. నయం చేయలేని వ్యాధులపై ప్రకటన ఇవ్వకూడదని తెలిదా?

Patanjali Ads Case: పతంజలి వ్యవస్థాపకులు రామ్‌దేవ్ బాబా, ఎండీ బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి ఉత్పత్తుల తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసుపై విచారణలో భాగంగా రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై మరోసారి సర్వోన్నత న్యాయస్థానంలో మరోసారి క్షమాపణలు చెప్పారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని పతంజలి యాజమాన్యాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, అంతకుముందు చెప్పిన క్షమాపణను కోర్టు అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలో రామ్‌దేవ్, బాలకృష్ణ సుప్రీంకోర్టుకు వచ్చి మరోసారి క్షమాపణలు కోరారు. కోర్టు ఆదేశాలను అగౌరవ పర్చాలన్న ఉద్దేశం తమకు లేదని, భవిష్యత్తులో తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉంటామని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. వీరిద్దరి వివరణపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమనుల్లా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన గత ఉత్తర్వుల్లో ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదని పేర్కొంది. నయం చేయలేని వ్యాధులపై ప్రకటన ఇవ్వకూడదని తెలిదా అని ప్రశ్నించింది. ప్రజారోగ్యం విషయంలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని.. చేస్తున్నది మంచి పని అయినా అల్లోపతిని తగ్గించి చూపకూడదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

రామ్‌దేవ్ బాబా, ఎండీ బాలకృష్ణ క్షమాపణలు పరిశీలిస్తామని.. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 23కి వాయిదా వేసింది. అల్లోపతిని, వైద్యులను చులకన చేసే ప్రకటనలు చేస్తోందని పతంజలిపై 2022, ఆగస్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ).. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం గతేడాది నవంబర్ 21న పతంజలికి వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో ఫిబ్రవరి 27న పతంజలి ప్రకటనలపై నిషేధం విధించింది.

Also Read: కర్ర పట్టుకుని దూసుకొచ్చి.. నడిరోడ్డుపై యువకుడి గల్లా పట్టుకుని అమ్మాయి రచ్చ రచ్చ..

ట్రెండింగ్ వార్తలు