స్వీట్‌ వార్నింగ్ : ఇసుక..గులకరాళ్ల స్వీట్లు పంపుతా – మమత

  • Publish Date - April 27, 2019 / 01:01 AM IST

పశ్చిమబెంగల్‌ సీఎం మమతా బెనర్జీ..ప్రధాని నరేంద్ర మోడీపై ఫైరయ్యారు. దీదీ తనకు ఏటా స్వీట్లు పంపుతారని మోడీ వెల్లడించడంపై భగ్గుమన్నారు. ఈసారి ప్రధానికి ఇసుక, గులకరాళ్లతో తయారుచేసిన స్వీట్లను పంపుతానని ఘాటుగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం అసన్‌సోల్‌లో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ తాను ప్రధాని మోడీకి ఏటా బెంగాల్‌ రసగుల్లాలు పంపుతుంటానని చెప్పారు. కానీ ఈసారి లడ్డులో జీడిపప్పు, బాదం వాడకుండా..ఇసుక, గులకరాళ్లతో చేసిన స్వీట్స్‌ పంపుతానని..దీంతో ఆయన పళ్లు ఊడటం ఖాయమన్నారు.

ఇక ఇదే పట్టణంలో గతవారం జరిగిన ర్యాలీలో ప్రసంగించిన మోడీ ప్రధాని పదవి వేలం వేయరని దీదీకి చురకలు అంటించారు. కాగా సినీ నటుడు అక్షయ్‌ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ తనకు ఏటా స్వీట్స్‌, బహుమతులు పంపుతుంటారని.. అలాగే ఏటా రెండు కుర్తాలు కూడా పంపుతుంటారని చెప్పడంతో దీదీ ధీటుగా బదులిచ్చారు. స్వీట్లు, బహుమతులతో స్వాగతించడం బెంగాల్‌ సంస్కృతి అన్నారు మమతా బెనర్జీ. అలాగే బెంగాల్‌లో మోడీకి రసగుల్లాలు దొరుకుతాయి కానీ.. ఓట్లు కాదని ఆమె ఎద్దేవా చేశారు.