×
Ad

స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: భారత్‌ గురించి సునితా విలియమ్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

"రాత్రి వేళ భారతదేశం అద్భుతంగా ఉంటుంది. నగరాలన్నీ వెలుగులతో నిండిపోతాయి. తెల్లటి లైట్లు కనిపిస్తాయి" అని సునితా విలియమ్స్‌ చెప్పారు.

Sunita williams (Image Credit To Original Source)

  • ఇటీవలే సునితా విలియమ్స్ పదవీ విరమణ
  • పెద్ద పెద్ద ప్రాంతాల్లో పడవలు స్పష్టంగా కనిపిస్తాయి
  • కొన్ని సార్లు ఫొటో తీయడం కష్టమన్న సునిత
  • అంతరిక్షం నుంచి భారత్‌ ఎలా కనపడుతుందో చెప్పిన విలియమ్స్

Sunita Williams: నాసా వ్యోమగామి సునితా విలియమ్స్ రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 27 ఏళ్ల పాటు నాసాలో సేవలు అందించిన ఆమె.. తాజాగా రాజ్ శమణి యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు.

అంతరిక్షం నుంచి భారత్‌ ఎలా కనపడుతుంది? అన్న ప్రశ్నకు సునితా విలియమ్స్‌ స్పందించారు. “కొన్ని సార్లు ఫొటో తీయడం కష్టం. ఎందుకంటే అక్కడ తరచూ పొగమంచు ఉంటుంది. కానీ, కొన్ని సార్లు అద్భుతంగా కనిపిస్తుంది. మొత్తం విషయం వాతావరణంపై ఆధారపడి ఉంటుంది.

నేను చివరిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది. భారతదేశ పడమర తీరానికి ఎదురుగా అరేబియా గల్ఫ్‌లో చేపల వేట పడవలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు చేపల వేట పడవల సమూహాలు ఉంటాయి. కానీ నేను చూసినవి కచ్చితంగా భారతదేశం పడమర తీరానికి దగ్గరగా ఉన్నాయి.

ఇది చాలా విచిత్రంగా అనిపించింది. ఇవి నిజంగా చేపల వేట పడవలేనా అని అనుకున్నాను. పగటిపూట కొన్ని సార్లు పడవ కనిపించదు. కానీ, పడవ వెనక ఏర్పడే నీటి ముద్ర మాత్రం కనిపిస్తుంది. ఆ పడవలపై అద్భుతమైన లైట్లు ఉండాలి. నీటిలోకి చూస్తున్నారో, చేపలను ఆకర్షించాలనుకుంటున్నారో నాకు తెలియదు.

కానీ, పెద్ద పెద్ద ప్రాంతాల్లో పడవలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ దృశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రాత్రి సమయంలో కొత్త ఎక్స్‌పీరియన్స్‌. రాత్రి వేళ భారతదేశం అద్భుతంగా ఉంటుంది. నగరాలన్నీ వెలుగులతో నిండిపోతాయి. తెల్లటి లైట్లు కనిపిస్తాయి. ఆ లైట్లు అన్నీ ఒకదానితో ఒకటి కలిసినట్టు అనిపిస్తాయి.

ఆ సమయంలో నరాల చిత్రాలు గుర్తొస్తాయి. డాక్టర్లు నరాల సమస్య వివరించేటప్పుడు చూపించే చిత్రాలు ఎలా ఉంటాయో అలా అనిపిస్తుంది. భారతదేశం రాత్రి వేళ అలా కనిపిస్తుంది.  ఈసారి నాకు మిగిలిన ఎక్స్‌పీరియన్స్‌ ఇదే. గతసారి ఐఎస్‌ఎస్‌కు వెళ్లినప్పుడు ఇది అంతగా గుర్తు లేదు.

గతసారి పగటి సమయంలో భారతదేశాన్ని చూశాను. ఆ సమయంలో రంగులు అద్భుతంగా కనిపిస్తాయి. హిమాలయాలు నిజంగా అద్భుతం. అక్కడ భూఫలకాలు ఒకదానితో ఒకటి ఢీకొని పర్వతాలు ఏర్పడ్డాయన్న భావన స్పష్టంగా అనిపిస్తుంది. తీర ప్రాంతాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా తూర్పు తీరంలో నదులు సముద్రంలో కలిసే చోట నీటి రంగులు, వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి” అని తెలిపారు.