దేశంలో వరుసగా జరుగుతున్న లైంగిక నేరాలు కలకలం రేపుతున్నాయి. కోల్‌కతా హత్యాచారం ఘటన తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లో అత్యాచారాలు జరిగాయి. అభం శుభం తెలియని చిన్నారులపై కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు మానవమృగాలు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులకు కళ్లెం పడేదెపుడు? మృగాడి అకృత్యాలకు అబలలు బలైపోవాల్సిందేనా?
కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచార ఘటనతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తమిళనాడులో వెలుగుచూసిన లైంగికదాడుల ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.
మహారాష్ట్రలో..
మహారాష్ట్ర ఠాణె జిల్లా బద్లాపుర్‌లోని ఓ స్కూలులో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై దారుణానికి ఒడిగట్టాడు ఓ మృగాడు. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన స్కూలు స్వీపర్- పిల్లలపై దుర్మార్గానికి ఒడిగట్టాడు. నాలుగేళ్లలోపు ఇద్దరు బాలికలు టాయ్‌లెట్ కోసం వెళ్లిన సమయంలో క్లీనింగ్ పేరుతో చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరో బాలిక స్కూలుకు వెళ్లేందుకు భయపడుతుంటే పేరెంట్స్ డాక్టర్స్ వద్దకు తీసుకెళ్లగా లైంగిక దాడి జరిగినట్లు తేలింది.
ఈ ఘటనపై బాధిత బాలికల తల్లిదండ్రులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూలుపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అనంతరం స్థానికులు రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు.
మంగళవారం జరిగిన ఈ ఘటనలో సుమారు 10 గంటలపాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ జరిపి స్టేషన్ నుంచి ఖాళీ చేయించారు. బాధిత బాలికలకు న్యాయం చేయాలని, నిందితుడిని ఉరి తీయాల్సిందేనని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
ఈ ఘటనలోనూ పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 12న ఘటన జరిగితే ఆగస్టు 13న పోలీసులు FIR నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదుల్ని తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన సీఐ సహా ముగ్గురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అత్యాచార నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కోర్టు ఈ నెల 24 వరకు నిందితుడికి పోలీసుల కస్టడీ విధించింది. ఆందోళనకారులపై కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రిన్సిపాల్, బాధిత పిల్లల క్లాస్ టీచర్, ఇద్దరు సిబ్బందిని స్కూలు యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. స్కూలు యాజమాన్యం బాలికల టాయిలెట్ నిర్వహణ పనికోసం మహిళలను కేటాయించలేదని, సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.
బద్లాపూర్ స్కులు ఘటన తర్వాత- అకోలాలోని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఓ ఉపాధ్యాయుడి నిర్వాకం బయటపడింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్- బాలికలకు గత 4 నెలలుగా అసభ్యకర వీడియోలు చూపిస్తూ వేధింపులకు పాల్పడేవాడు. ఆరుగురు విద్యార్థుల ఫిర్యాదుతో ఉపాధ్యాయుడుపై ప్రభుత్వం వేటువేసింది. టీచర్ ప్రమోద్‌ను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లో..
మరోవైపు తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని ఓ ప్రయివేట్ స్కూలులో సిగ్గుపడే సంఘటన వెలుగు చూసింది. NCC క్యాంప్ నిర్వహణ పేరుతో ఓ బాలికపై అత్యాచారం, 12 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అర్థరాత్రి 13 ఏళ్ల బాలికపై శిక్షకుడు శివరామన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అది NCC నకిలీ క్యాంప్‌గా దర్యాప్తులో తేలింది.
ఆగస్టు 8న జరిగిన ఈ ఘటనలో NCC క్యాంపు నిర్వాహకుడు సహా 11 మందిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడు రోజుల పాటు జరిగిన క్యాంప్‌లో 40 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 17 మంది బాలికలు ఉన్నారు. తమకు వసతి కల్పించిన ఆడిటోరియం నుంచి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాలికలు ఆరోపించారు. స్కూలు యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టాలని చూసింది. మరోవైపు నిందితుడితో తమకు ఎలాంటి సంబంధం లేదని NCC ప్రకటించింది.
అటు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గర్ జిల్లాలో ఆదివాసీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. రక్షాబంధన్ సందర్భంగా ఓ వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా 8 మంది 27 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు గత కొన్నేళ్లుగా భర్తతో వేరుగా ఉంటోంది.
కఠిన చట్టాలు వచ్చినా…నిందితులకు ఉరిశిక్ష వేసినా మానవమృగాల్లో మార్పు రాకపోవడం శోచనీయం.. పిల్లల పెంపకంలో, సమాజం తీరులో రావాల్సిన మార్పును కళ్లకు గడుతున్నాయి ఈ దుర్ఘటనలు..
Also Read: విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేశ్.. డీఎస్పీ మురళీకృష్ణ ఏమన్నారో తెలుసా?