కుండపోత వానలు.. ముగ్గురి మృతి.. 100 మందిని కాపాడిన సిబ్బంది.. క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? విజువల్స్ చూస్తే గుండె గుబేలే..!

ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా వర్షాలు పడుతున్నాయి.

Cloudburst in JK

జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా రెండు రోజులుగా కుండపోత వానలు పడుతున్నాయి. కొండచరియలు విరిగిపడి రాంబన్‌ జిల్లాలో పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరదల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల శిథిలాల కింద వాహనాలు చిక్కుకున్నాయి. ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా వర్షాలు పడుతున్నాయి. వరదల వల్ల చీనాబ్ బ్రిడ్జి సమీపంలోని ధరంకుండ్ గ్రామం జలమయమైంది.

ఇళ్లు, వాహనాలు వరదలకు కొట్టుకుపోయాయి. అక్కడి ప్రజలను రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సూచించారు.

క్లౌడ్ బరస్ట్ అంటే?
మేఘాల విస్ఫోటనాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒకటి నుంచి 10 కి.మీ.లోపు ప్రాంతంలో గంట వ్యవధిలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘాల విస్ఫోటనం అంటారు. కొన్ని సార్లు ఒకే ప్రాంతంలో పదే పదే క్లౌడ్ బరస్ట్ జరగవచ్చు.