Cloud Burst: మేఘం బద్దలైనట్లు, ఆకాశం ఊడిపడినట్లు ఎప్పుడూ చూడని విలయంతో జమ్మూకశ్మీర్ వణికిపోతోంది. వరద నీళ్లు అందులో కలుస్తున్న కన్నీళ్లు.. అంచనాకు కూడా అందని స్థాయిలో కష్టం నష్టం కలిగిస్తున్నాయి.
మళ్లీ మళ్లీ విరుచుకుపడుతున్న క్లౌడ్ బరస్ట్ లు జనాల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. జమ్ముకశ్మీర్ ప్రకృతి విలయంతో యావత్ దేశం అలర్ట్ అయ్యింది.
మేఘ విస్పోటనం మిగిల్చిన భయానక దృశ్యాలు గుర్తు చేసుకుని వణికిపోతోంది.
ఆకాశం బద్దలైందా అనే రేంజ్ లో పడుతున్న వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అసలు జమ్ముకశ్మీర్ లో ఎందుకిలా జరుగుతోంది.
క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? అసలు ఎందుకొస్తాయి? ముందే గుర్తించి ప్రమాద తీవ్రతను తగ్గించడం సాధ్యమేనా? దేశంలో క్లౌడ్ బరస్ట్ విలయం సృష్టించిన సంఘటనలు ఎన్ని? ఎప్పుడెప్పుడు జరిగాయి?
జమ్ముకశ్మీర్ లో మేఘ విస్ఫోటనాలు భారీ విషాదం సృష్టిస్తున్న వేళ అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి అనేదానిపై చర్చ మొదలైంది.
అతి తక్కువ సమయంలో అతి తక్కువ భౌగోళిక ప్రాంతంలో అతి ఎక్కువ వర్షపాతం పడటమే క్లౌడ్ బరస్ట్.
20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం పడితే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కోసారి ఉరుములు పిడుగులతో భారీ స్థాయిలో కురిసే వర్షాల కారణంగా వరదలు వస్తుంటాయి.
తక్కువ పరిధిలో రెండు గంటల వ్యవధిలో 5 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం పడితే మెనీ క్లౌడ్ బరస్ట్ అంటారు. అయితే, తక్కువ సమయంలో కురిసే అన్ని భారీ వర్షాలను క్లౌడ్ బరస్ట్ లు అనలేము.
కొన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఉంటేనే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇవి అధిక తేమ కలిగిన మేఘాలుగా మారతాయి.
వాతావరణంలో వేడి కారణంగా ఈ మేఘాలు కరుగుతూ ఉంటాయి. అలా కరిగి కరిగి మేఘాలు బరువెక్కుతాయి. ఏదో ఒక చోట పేలిపోతాయి.
అలా తక్కువ ప్రాంతంలో తక్కువ సమయంలో భారీ వర్షం పడి వినాశనం జరుగుతుంది. ఇప్పుడు జమ్మూకాశ్మీర్ లో జరిగింది అదే.
రాడార్ డేటా, ఉపగ్రహ చిత్రాలు, వాతావరణ నమూనాల ద్వారా క్లౌడ్ బరస్ట్ లు జరిగే ప్రమాదాన్ని గుర్తించే అవకాశం ఉన్నా అది ఎప్పుడు ఎక్కడ అవుతాయి అనేది మాత్రం అంచనా వేయడం చాలా కష్టం.
క్లౌడ్ బరస్ట్ సమయంలో దట్టమైన, నల్లని క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఒక్కసారిగా బలమైన చల్లని గాలులు వీయడం లేదంటే గాలిలో తేమ స్థాయి పెరగడం జరుగుతుంది. దేశంలో గతంలో చాలా క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగాయి.
* 1970లో ఉత్తరాఖండ్ లోని అలకనంద లోయలో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించింది.
* 1993లో ఉత్తరాఖండ్ లోని పితోరాఘర్ జిల్లా మల్ప గ్రామంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న భక్తులు చాలా మంది చనిపోయారు.
* 2003- 2004 మధ్య ఉత్తరాఖండ్ లోని కులు, చమలి ఏరియాల్లో మినీ క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది.
* 2010లో లద్దాఖ్ లోని లేహ్ లో క్లౌడ్ బరస్ట్ కారణంగా విషాదం చోటు చేసుకుంది. దాదాపు 200 మంది చనిపోయారు.
* 2022 జమ్మూకాశ్మీర్ లో అమర్ నాథ్ గుహ దగ్గర క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకున్న ఘటనలో చాలామంది మరణించారు.
Also Read: 1,000 అడుగుల ‘మెగా సునామీ’.. తలుచుకుంటేనే గజగజా వణికిపోతాం.. అటువంటిది ఇప్పుడు..