హిందుత్వకు అవమానకరం…నిర్మలా “ACT OF GOD”వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ ఫైర్

కరోనా ప్రభావంతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి గతవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ వ్యాఖ్యలను శివసేన నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ తప్పుపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ… దైవ చర్యతో కుప్పకూలిందని ఆర్థిక మంత్రి చెప్పడం సరైంది కాదని సంజయ్‌ రౌత్‌ మండిపడ్డారు.

ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతూ దేవుడ్ని నిందించడం హిందుత్వకు అవమానకరమని ఆయన పేర్కొన్నారు. దేవుడి తప్పిదమే అయితే ఏ కోర్టులో ఆయనను విచారిసారు..? ప్రభుత్వ చేతికానితనానికి దేవుడిపై నెపం మోపడం హిందుత్వకు అవమానకరమని సామ్నా పత్రికలో రాసిన వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ పైనా శివసేన నేత విమర్శలు గుప్పించారు.

మన ప్రధాని అన్ని విషయాల గురించి మాట్లాడతారు..దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థపై మాత్రం నోరుమెదపరు..నోట్ల రద్దు నుంచి లాక్‌డౌన్‌ వరకూ సాగిన ప్రయాణంలో మన ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైందని రౌత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు బ్రెజిల్‌ సహా పలు దేశాలు తమ పౌరులకు ఆర్థికంగా చేయూత అందించాయని, ఆయా ప్రభుత్వాలు కోవిడ్‌-19 సమస్యను దైవ ఘటనగా చూడలేదని, ఆర్థిక సంక్షోభంగానే పరిగణించి పౌరులను ప్రభుత్వాలు ఆదుకున్నాయని అన్నారు.

కాగా,ఆగస్టు-27,2020న జీఎస్టీ 41వ మండలి సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కోవిడ్ అనేది యాక్ట్ ఆఫ్ గాడ్. కరోనా వల్ల ఈ ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు తగ్గింది. ఫలితంగా జీఎస్టీ వసూళ్లు తగ్గాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అని సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.