×
Ad

హిడ్మా ఎవరు? ఈ భారీ గెరిల్లా దాడుల వ్యూహకర్తపై రూ.కోటి రివార్డు.. ఎన్ని భీకరదాడులు చేశాడో, ఎలా తప్పించుకునేవాడో తెలుసా?

భద్రతా బలగాలు అడవుల్లో క్యాంపులు వేసుకుంటే వాటిపై ఆకస్మాత్తుగా దాడులు చేయడంలో హిడ్మా ఆరితేరాడు.

Hidma

Maoist Commander Hidma: భారత బలగాలకు చిక్కకుండా ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్న మావోయిస్టు కమాండర్ హిడ్మా ఎట్టకేలకు హతమయ్యాడు. అతడి రెండో భార్య రాజే/రాజక్కను కూడా భద్రతా బలగాలు హతమార్చాయి. మావోయిస్టు పార్టీలో ఉంటూ ఎన్నో వ్యూహాలు వేసి ఘోరాతిఘోరమైన దాడులు చేశాడు హిడ్మా.

దంతెవాడ 2010, జిరామ్ ఘాటి 2013, సుక్మా-బీజాపూర్ 2021 దాడులు సహా 26 ప్రధాన దాడుల సూత్రధారి అతడే. భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా అతడికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. కనీసం అతడి ఫొటో కూడా ఈ ఏడాది జూన్‌ వరకు బయటకు రాలేదు. అంతకుముందు వరకు 25 క్రితం నాటి అతడి ఫొటోనే అందుబాటులో ఉండేది. (Maoist Commander Hidma)

Also Read: Madavi Hidma: మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నేత హిడ్మా హతం

ఊహకందని విధంగా హిడ్మా దాడులు 
హిడ్మా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. అతడికి హిడ్మా, హిడ్మాల్, విలాస్, సంతోష్‌ పేర్లు ఉన్నాయి. హిడ్మా వయసు 44 ఏళ్లు. అతడు మురియా తెగకు చెందినవాడు. తెలుగు, హిందీతో పాటు గోండి, కోయ, బెంగాలీ భాషలు మాట్లాడతాడు. అతడు మావోయిస్టులను దండకారణ్యంలో ముందుండి నడిపించేవాడు.

భద్రతా బలగాలు అడవుల్లో క్యాంపులు వేసుకుంటే వాటిపై ఆకస్మాత్తుగా దాడులు చేయడంలో హిడ్మా ఆరితేరాడు. ఇటువంటి దాడులు చేయడంలో ప్రసిద్ధి చెందిన పీఎల్‌జీఏలో ఒకటో బెటాలియన్‌కు అతడే నాయకుడు. అన్ని భారీ దాడుల్లోనూ అతడు స్వయంగా పాల్గొని, తప్పించుకునేవాడు. అతడికి కేంద్ర కమిటీలోనూ స్థానం దక్కింది. ఆ కమిటీలో హిడ్మానే అత్యంత పిన్నవయస్కుడిగా ఉన్నాడు.

భద్రతా బలగాల వ్యూహాలను మంచిపోయే వ్యూహాలు వేయడంలో హిడ్మా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండువాడు. అతడి గురించి భద్రతా బలగాల వద్ద కొద్దిగానే సమాచారం ఉంది. గతంలో బయటపడ్డ ఫొటోలు కూడా హిడ్మావేనా అన్న అనుమానాలు ఉండేవి.

హిడ్మా సన్నగా, 5.6 అడుగుల ఎత్తుతో, పలుచని మీసంతో ఉంటాడనే విషయాన్ని మాత్రమే పోలీసులు గతంలో తెలుసుకున్నారు. హిడ్మా 2004 నుంచి అనేక భీకరదాడుల్లో పాల్గొన్నాడు. 2010 దంతేవాడ దాడిలో 76 సీఆర్పీఎఫ్‌ సిబ్బంది చనిపోయారు. 2013 జిరామ్‌ ఘాటి దాడిలో మొత్తం 27 మంది మృతి చెందారు. అందులో కాంగ్రెస్‌ నేతలు కూడా ఉన్నారు.

2021 సుక్మా-బీజాపూర్‌ దాడిలో 22 భద్రతా సిబ్బంది మృతి చెందారు. హిడ్మా ఆపరేషన్‌లలో అధిక శాతం విజయాలే ఉన్నాయి. భద్రతా బలగాలపై దాడులు చేయడంలో అతడి ప్రణాళిక అత్యంత కచ్చితంగా ఉంటుందని చెబుతారు.