Site icon 10TV Telugu

మావోయిస్టు అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు హతం.. ఎవరీయన?

Nambala Keshav Rao

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని నారాయ‌ణ‌పూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు (67) మృతి చెందిన‌ట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌లో మొత్తం 28 మావోయిస్టులు మృతి చెందిన విష‌యం తెలిసిందే.

నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్న అలియాస్ ప్రకాశ్ అలియాస్‌ దారపు నరసింహారెడ్డి 1955లో జన్మించారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి. జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు.

ఆయన శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి. మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా 2018, నవంబర్ 10న ఎన్నికయ్యారు. ముప్పాల లక్ష్మణరావు (అలియాస్ గణపతి) రాజీనామా తర్వాత ఆయన పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు.

వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి నంబాల కేశవరావు బీటెక్ చేశారు. 1970 నుంచి నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్నారు. 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU)లో పనిచేశారు. 1980లో ఆంధ్రప్రదేశ్‌లో CPI (ML) పీపుల్స్ వార్ ఏర్పడినప్పుడు, ఆయన కీలక నిర్వాహకులలో ఒకరు.

తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో మొదటి కమాండర్. గెరిల్లా యుద్దం, ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ల వాడకంలో ఆయన ఎక్స్‌పర్ట్‌. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ నుంచి గెరిల్లా యుద్ధ శిక్షణ పొందారు. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమీషన్ అధిపతిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా నియామితుడయ్యారు.

చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో దాడుల వెనుక ఆయన హస్తం ఉంది. ఏపీలోని ఎమ్మెల్యే కిడారి ఈశ్వరరావు హత్యకు నంబాల కేశవరావు ప్రధాన సూత్రధారి. 2010 దంతేవాడలో జరిగిన భారీ బ్లాస్ట్ కు సూత్రధారి.

Exit mobile version