త్వరలో కరోనా వ్యాక్సిన్.. ధరపై రాష్ట్రాలతో చర్చిస్తున్నాం: ప్రధాని ప్రకటన

  • Publish Date - December 4, 2020 / 10:35 AM IST

PM Modi on Corona Vaccine: కరోనా వైరస్‌పై అఖిలపక్ష సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సంధర్భంగా మోడీ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ త‌యారీలో మ‌న శాస్త్ర‌వేత్త‌లు విశ్వాసంతో ఉన్న‌ట్లు వెల్లడించారు. అత్యంత చౌకైన‌, సుర‌క్షిత‌మైన టీకాపై ప్ర‌పంచం దృష్టి పెట్టింద‌ని, అందుకే అంద‌రూ ఇండియా వైపు ఆశగా చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో ఉన్న విప‌క్ష నేత‌ల‌తో వ‌ర్చువ‌ల్ మీటింగ్‌లో మాట్లాడిన మోడీ.. వ‌చ్చే కొన్ని వారాల్లో కరోనా టీకా వ‌స్తుంద‌ని స్పష్టం చేశారు.



శాస్త్ర‌వేత్త‌లు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వెంటేనే.. భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌ల‌వుతుందని, హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు, వృద్ధులకు మొదట కరోనా వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది అని చెప్పారు ప్రధాని. వ్యాధి కారణంగా తీవ్రంగా బాధ‌ప‌డేవారికి తొలుత టీకా ఇవ్వ‌నున్న‌ట్లు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ధ‌ర విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో కేంద్రం సంప్ర‌దిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ప‌బ్లిక్ హెల్త్‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తూ టీకా ధ‌ర‌ను నిర్ణ‌యించనున్నట్లు చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రధాని స్పష్టం చేశారు.



వ్యాక్సిన్ పంపిణీ ఎలా చెయ్యాలి? అనే విషయంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ బృందాలు కలిసి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాయ‌ని, వ్యాక్సిన్ పంపిణీలో ఇత‌ర దేశాల‌తో పోలిస్తే భార‌త్ మెరుగైన స్థానంలో ఉంటుందని అన్నారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో భార‌త్‌కు విస్తృత‌మైన నెట్వ‌ర్క్‌, అనుభ‌వం ఉంద‌ని, కోవిడ్‌పై అన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ సూచ‌ల‌ను లిఖిత‌పూర్వంగా ఇవ్వాలని ప్రధాని కోరారు. దేశీయంగా 8 వ్యాక్సిన్లు వివిధ దశలలో ఉన్నట్లు ప్రధాని మోడీ చెప్పారు.