Site icon 10TV Telugu

Assembly Elections 2023: ఓడింది కాంగ్రెస్ అయితే.. ఆయనేంటి మోదీ ఓడిపోయారని అంటారు?

why adhir ranjan said modi defeated in mp and chhattisgarh and rajasthan assembly polls 2023

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో భారతీయ జనతా పార్టీ బంపర్ విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ ఓ విచిత్ర వాదన చేశారు. ఇది బీజేపీ విజయమని, అదే సందర్భంలో ప్రధాని మోదీ ఓడారని ఆయన అన్నారు. దీనికి ఆయన కారణం చెప్పారు. కొద్ది రోజుల క్రితం కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ప్రధాని ఎక్కడ ఉన్నారని, అప్పుడు మోదీ ఓటమి అని బీజేపీ ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల్లో విజయం వచ్చినప్పుడు మాత్రమే ప్రధానిని ముందుకు వేయడం.. పరాజయం వచ్చినప్పుడు ఆయనను తప్పించడం జరుగుతోందని అని ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఎన్నికల రంగంలో మోదీ ఓడిపోయారని, బీజేపీ నేతల కష్టంతో వచ్చిన విజయాల్ని ఆయన ఖాతాలో వేసుకుంటున్నారని అధిర్ రంజన్ అన్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై వెంటకరమణా రెడ్డి గెలుపుకు కారణాలివే

ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు విపక్షాల ఓటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఓడిపోయిన వారు పార్లమెంటులో తమ ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేయవద్దంటూ ప్రధాని సెటైర్లు విసిరారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాలకు సలహాలు ఇస్తూ.. ఇది తమకు సువర్ణావకాశమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు ప్రణాళికలు వేసుకునే బదులు, గత ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని 9 ఏళ్ల ప్రతికూల ధోరణిని వీడి ఈ సమావేశంలో సానుకూలతతో ముందుకు సాగితే.. వారి పట్ల దేశ దృక్పథమే మారిపోతుందని అన్నారు.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ 164 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 66 సీట్లు గెలుచుకుంది. రాజస్థాన్‌లో బీజేపీ 115 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 69 సీట్లు గెలుచుకుంది. ఇది కాకుండా ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి 54, కాంగ్రెస్‌కు 35 సీట్లు వచ్చాయి. తెలంగాణలో చూస్తే.. కాంగ్రెస్‌కు 64, బీఆర్‌ఎస్‌కు 39, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

Exit mobile version