PM Modi: తెలుగు వ్యక్తి విఠలాచార్యపై ప్రధాని మోదీ ప్రశంసలు

ప్రధాని మోదీ మన్ కీ బాత్‌ వేదికగా ప్రసంగించి తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను ప్రశంసలతో ముంచెత్తారు. పుస్తకాల గురించి వివరించే క్రమంలో విఠలాచార్య ప్రస్తావన...

PM Modi: తెలుగు వ్యక్తి విఠలాచార్యపై ప్రధాని మోదీ ప్రశంసలు

Pm Modi

Updated On : December 26, 2021 / 6:57 PM IST

PM Modi: ప్రధాని మోదీ మన్ కీ బాత్‌ వేదికగా ప్రసంగించి తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను ప్రశంసలతో ముంచెత్తారు. పుస్తకాల గురించి వివరించే క్రమంలో విఠలాచార్య ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన జీవితాన్ని ఉదహరిస్తూ కలను సాకారం చేసుకోవడానికి వయస్సు అడ్డం కాదని అన్నారు.

‘భారత దేశం చాలా అసాధారణమైన ప్రతిభలతో సుసంపన్నమైంది. ప్రతిభా మూర్తులైన క్రియేటివిటీ ఇతరులను ప్రేరేపిస్తుంది. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ఒకరు. 84 సంవత్సరాలు వయస్సున్న ఆయన… కలలను నెరవేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదనేందుకు ఉదాహరణగా నిలిచారు. పెద్ద గ్రంథాలయాన్ని తెరవాలనే విఠలాచార్య చిన్నప్పటి కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు’

‘ఇంకా స్వాతంత్ర్యం రాని రోజుల్లో చిన్ననాటి కల కలగానే మిగిలిపోయింది. కాలక్రమేణా విఠలాచార్య అధ్యాపకుడయ్యారు. తెలుగు భాషను లోతుగా అధ్యయనం చేసి అనేక సృజనాత్మక రచనలు చేశారు. 6-7 సంవత్సరాల క్రితం తన కలను నెరవేర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. సొంత పుస్తకాలతో లైబ్రరీని ప్రారంభించారు. జీవితకాల సంపాదనను ఇందులో పెట్టారు. క్రమంగా ప్రజలు అందులో చేరడం, సహకరించడం ప్రారంభించారు’

rEAD aLSO: బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ కమిటీ

‘యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఈ గ్రంథాలయంలో దాదాపు 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. చదువుతో మొదలుకొని అనేక విషయాల్లో తాను పడిన ఇబ్బందులు మరెవరికీ రాకూడదని విఠలాచార్య అంటారు. అధిక సంఖ్యలో విద్యార్థులు దాని ప్రయోజనాలను పొందడం చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఆయనను స్ఫూర్తి పొంది అనేక ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు” అని ప్రధాని మోదీ అన్నారు.