EVMs: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు ఉపయోగించరు.. కారణం ఏంటి..

ఆ ఎలక్షన్స్ లో వీటిని ఉపయోగించరు. అసలు ఈవీఎంల ఊసే వినిపించదు.

EVMs: ఎన్నికలు అనగానే అందరికీ ముందుగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ ( EVM)లే గుర్తుకొస్తాయి. ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ లో ఎన్నికల నిర్వహణలో ఈవీఎంలది అత్యంత కీలక పాత్ర. ఇప్పటివరకు 5 లోక్‌సభ ఎన్నికలతో పాటు 130 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను వాడారు.

ఎన్నికల నిర్వహణలో ఇంత కీ రోల్ ప్లే చేస్తున్న ఈవీఎంలు.. కీలకమైన రెండు ఎన్నికల్లో మాత్రం వీటి పాత్ర అస్సలు ఉండదు. ఆ ఎలక్షన్స్ లో వీటిని ఉపయోగించరు. అసలు ఈవీఎంల ఊసే వినిపించదు. అవే.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు. అవును.. ఈ ఎన్నికల్లో మాత్రం వీటిని ఉపయోగించే పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటంటే.. ఈవీఎంలను ఓటు అగ్రిగేటర్లుగా రూపొందించడమే.

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో ఉపయోగించేందుకు వీలుగా (వోట్ అగ్రిగేటర్) ఈవీఎంలను డిజైన్ చేశారు. అభ్యర్థి పేరు పక్కన ఉన్న బటన్‌ను ఓటర్ నొక్కాల్సి ఉంటుంది. ఆయా అభ్యర్థులకు పోలైన ఓట్లను మాత్రమే ఇది చూపిస్తుంది. అత్యధిక ఓట్లను పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కానీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇందుకు పూర్తిగా భిన్నం. దామాషా ప్రాతినిధ్య విధానం ప్రకారం ఈ ఎన్నికలు జరుగుతాయి.

సింగిల్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ఓటింగ్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో రహస్య బ్యాలెట్‌ విధానం అనుసరిస్తారు. ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల పక్కన ఓటర్లు తమ ప్రాధాన్యం తెలిపే అంకె (1, 2..) వేయాలి. అక్షరాల్లో రాయకూడదు. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ప్రకారం ఓటర్లు తమకు నచ్చినంత వరకు ప్రాధాన్య అంకెలను బ్యాలెట్‌పై రాయొచ్చు.

* ఓటు చెల్లుబాటు కావాలంటే మొదటి ప్రాధాన్య అంకె తప్పనిసరిగా వేయాలి. మిగతా ప్రాధాన్య అంకెలు నచ్చితే వేయొచ్చు.. లేదంటే లేదు.
* ఈ ఓటింగ్‌ కోసం ఓటర్లకు ప్రత్యేక పెన్నులు ఇస్తుంది ఈసీ.
* ఆ పెన్నుతోనే ఓటర్లు మార్కింగ్ చేయాలి.
* ఇతర పెన్ను ఏది వాడినా కౌంటింగ్ లో ఆ ఓటును చెల్లుబాటు కాదు.
* దామాషా ప్రాతినిధ్య విధానంలో జరిగే ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఆధారంగా ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది.
* ఇందుకోసం భిన్న సాంకేతికతతో కూడిన ఈవీఎంలు అవసరం.
* ప్రస్తుత ఈవీఎంలు కేవలం ఓట్ల అగ్రిగేటర్లుగా పనిచేస్తాయి.
* అందుకే వీటిని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాడలేమని అధికారులు చెబుతున్నారు.

ఈవీఎం రూపకల్పన ప్రయత్నాలు 1977లోనే మొదలయయ్యాయి. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ దీని రూపకల్పన, అభివృద్ధి బాధ్యతలు చేపట్టింది. 1979లో ఓ నమూనా తయారు చేయగా 1980లో అన్ని రాజకీయ పార్టీల ముందు దీని పనితీరును ప్రదర్శించింది. 1982లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంని ఉపయోగించారు.

1989లో ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ..

అయితే, దీనికి సంబంధించిన చట్టంలో స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో సుప్రీంకోర్టు ఆ ఎన్నికను కొట్టివేసింది. 1989లో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించారు. ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించేలా నిబంధనలు చేశారు. ఈవీఎంలను ప్రవేశపెట్టడంపై 1998లో ఏకాభిప్రాయం కుదిరింది. పలు రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ స్థానాల్లో ప్రయోగాత్మకంగా వాడారు. ఆ తర్వాత 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలను ఉపయోగించారు. అలా.. ఆ తర్వాత నుంచి అన్ని ఎలక్షన్స్ లో ఈవీఎంలనే వాడుతున్నారు.

అటు.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఈ ఎన్నికలో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య పోరు నెలకొంది. ఎన్డీఏ తరఫున సీనియర్ నేత, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగుతేజం జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికను రెండు ప్రధాన కూటముల మధ్య బలపరీక్షగా అనలిస్టులు అభివర్ణిస్తున్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ భవన్‌లో జరగనుంది. ఉభయ సభలకు చెందిన ఎంపీలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రికి ఫలితాలు వెల్లడిస్తారు. దేశ నూతన ఉపరాష్ట్రపతి ఎవరో ప్రకటిస్తారు.

Also Read: శాంసంగ్ కంపెనీ అఫిషియల్ ప్రకటన.. ఆన్ లైన్లో శాంసంగ్ ఫోన్ కొనాలనుకుంటే తప్పకుండా ఇది చదవండి..