Online Medicines: మందులు హోమ్ డెలివరీ విధానంకు చెక్..! ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందా..? ఎందుకంటే..

కోవిడ్ -19 పరిణామాల్లో ఎదురైన ఇబ్బందుల ఫలితంగా ఆన్ లైన్ లో మందులు కొనుగోలు చేసి, ఇంటికి తెప్పించుకొనే విధానం పెరిగింది.

medicine door delivery

Online Medicines: ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లో ఆర్డర్ పెడితే నిమిషాల్లో మీకు కావాల్సిన ఫుడ్ మీ ఇంటికొచ్చేస్తోంది. అంతేకాదు.. కూరగాయలు, ఇతర వస్తువులు కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికొచ్చేస్తున్నాయి. ఇదేక్రమంలో మందులను కూడా ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఇంటికి డెలివరీ చేస్తున్న ఆన్ లైన్ సంస్థలు ఇటీవలకాలంలో ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ -19 సమయం నుంచి మందులను ఆన్ లైన్ లో కొనుగోలు చేసి ఇంటికి తెప్పించుకొనే విధానం పెరిగింది.

 

ఆన్ లైన్ మందుల డెలివరీ సేవల్లో మెడిబడ్డీ, హెల్ మగ్, ట్రూమెడ్స్, 1ఎంజీ, నైట్ మెడ్స్, మైరా మెడిసిన్స్ వంటి సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. వీటికి అదనంగా ఫుడ్ డెలివరీ సేవల్లో ఉన్న సంస్థలు కూడా మందుల పంపిణీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కేవలం 10 నిమిషాల్లోనే మందులు ఇంటికి తీసుకువచ్చే సేవలనూ కొన్ని సంస్థలు ప్రారంభించాయి. అయితే, ఈ ఆన్ లైన్ డెలివరీ ద్వారా మందుల పంపిణీతో అనేక ఇబ్బదులు తలెత్తుతాయని, రోగులకు నష్టం జరుగుతుందని కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

కోవిడ్ -19 పరిణామాల్లో ఎదురైన ఇబ్బందుల ఫలితంగా ఆన్ లైన్ లో మందులు కొనుగోలు చేసి, ఇంటికి తెప్పించుకొనే విధానం పెరిగింది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ విధానాన్ని అనుమతించింది. కానీ, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో మందులు విక్రయించాలనే నిబంధన ఉండగా.. ఇంటికే మందులు ఎలా పంపుతారనే ప్రశ్నలను దేశవ్యాప్తంగా మందుల రిటైల్ విక్రయదారులు తరచు లేవనెత్తుతున్నారు. కోవిడ్ పరిస్థితులు లేవు కనుక.. ప్రస్తుతం ఇలాంటి సేవల అవసరం లేదన్నది అఖిల భారత కెమిస్ట్స్ అండ్ డ్రగ్టిస్ట్స్ సంఘం (ఏఐఓసీడీ) వాదన. ఆన్ లైన్లో మందుల విక్రయాలు, పంపిణీకి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని ఏఐఓసీడీ డిమాండ్ చేస్తోంది.

 

ఈ మొత్తం వ్యవహారంపై పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డీటీఏబీ)ను కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆదేశించింది. దీంతో ఆన్ లైన్ లో మందులు డెలివరీ విధానంలోని లాభ నష్టాలు ఏమిటి..? దీన్ని కొనసాగించాలా లేక నిలిపివేయాలా..? మార్పులు ఏమైనా సూచించాలా అనే అంశాలపై డీటీఏబీ దృష్టి సారించనుంది.