Didi (1)
Mamata Banerjee మమతా బెనర్జీ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన శుక్రవారం ముగిసింది. ఢిల్లీ పర్యటనలో మమత..ప్రధాని మోదీ,కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువరు విపక్ష నేతలు,కేంద్రమంత్రులను కలిశారు. అయితే ఐదు రోజుల ఢిల్లీ పర్యటనను విజయంతంగా ముగించుకున్న సందర్భంగా దీదీ సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను ప్రతి రెండు నెలలకోసారి తాను ఢిల్లీకి వస్తానని దీదీ తెలిపారు.
ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా శుక్రవారం మమత మీడియాతో మాట్లాడుతూ.. చాలా మంది విపక్ష నేతలని కలిశానని,తన ఢిల్లీ పర్యటన విజయవంతమైందని దీదీ తెలిపారు. దేశ రాజకీయ పరిస్థితులపై శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించినట్లు తెలిపారు. ప్రతిపక్ష ఐక్యత సమస్యపై కూడా గాంధీ కుటుంబంతో చర్చించినట్లు చెప్పారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ కంట్రీ ఇదే తమ నినాదమని దీదీ ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని మమత ప్రకటించారు. ప్రాజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి విపక్షాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం తాను శరద్ పవార్ తో ఫోన్ లో మాత్రమే మాట్లాడానని,ఈ సారి ఢిల్లీ పర్యటనలో ఆయనను కలవనున్నట్లు మమత తెలిపారు.
ఇక,2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై ప్రశ్నించినపుడు మాత్రం సమాధానాన్ని దాటవేసిన మమతా..ప్రతి ఒక్కరి నినాదం దేశాన్ని రక్షించడమే కావాలన్నారు. ఈ సందర్భంగా దేశీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పెట్రోల్, గ్యాస్ ధరలపై ఆమె మండిపడ్డారు. దేశం అభివృద్ధి చెందాలని దీదీ అన్నారు. తాము అన్ని వర్గాల అభివృద్ధి కోరుకుంటున్నామని.. రైతులు రోడ్లపై ఉన్నారని,రైతులకు తమ మద్దుతు ఎల్లప్పుడూ ఉంటుందని దీదీ తెలిపారు. అలాగే రానున్న కరోనా మూడో దశ ముప్పుపై కూడా ఆమె కేంద్రాన్ని హెచ్చరించారు.