చేతులెత్తి మొక్కుతున్నా..రైతులను తప్పుదోవ పట్టించొద్దు

Modi urges Opposition not to mislead farmers మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైసన్ లో నిర్వహించిన “కిసాన్ కళ్యాణ్” కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కిసాన్‌ కల్యాణ్‌ పథకం ప్రారంభించిన ప్రధాని అనంతరం మధ్యప్రదేశ్ రైతులను ఉద్ధేశించి వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. మధ్యప్రదేశల్​లో ఇవాళ.. 35 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 16 వేల కోట్ల రూపాయలు జమ అయినట్లు ప్రధాని తెలిపారు ప్రధాని. ఖరీఫ్​లో పంట నష్టపోయిన వారికి ఈ మొత్తం పరిహారం అందించింది శివరాజ్​సింగ్​ ప్రభుత్వం.

ఇవాళ, తాము వేలమంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని మోడీ తెలిపారు. గతంలో ఇవి రైతులందరికీ అందుబాటులో లేవని..అయితే ప్రతి ఒక్క రైతుకి కిసాన్ క్రెడిట్ కార్డు అందేలా తాము రూల్స్ ని మార్చామని తెలిపారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. గోదాముల సామర్థ్యం పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. గిడ్డంగుల సదుపాయం రైతులకు అతి ముఖ్యమైనదని పేర్కొన్నారు.

రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. రైతులను తప్పుదోవ పట్టించవద్దని విపక్షాలకు చేతులు జోడించి అభ్యర్థించారు. సాగు చట్టాల విషయంలో రైతులను తప్పుదోవ పట్టించే ధోరణిని విపక్షాలు మానుకోవాలన్నారు. విపక్ష పార్టీల పాత మేనిఫెస్టోలకే ఈ క్రెడిట్ అంతా తాను ఇస్తున్నానని అన్నారు. రైతుల సౌలభ్యం, పురోగతి, మెరుగైన ఆధునిక వ్యవసాయం కోసమే చట్టాలను తీసుకొచ్చినట్లు వ్యాఖ్యానించారు. గత ఆరు, ఏడు నెలలుగా సాగు చట్టాలు అమలువుతుంటే..ఇప్పుడు ఆందోళనలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇదంతా ఒక రాష్ట్రం నుంచే జరుగుతుందన్నారు. రైతుల పేరిట ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వాళ్లు..వారు ప్రభుత్వాన్ని నడపడానికి లేదా ప్రభుత్వంలో భాగం కావడానికి అవకాశం వచ్చినప్పుడు వారు అప్పటికి ఏమి చేసారో దేశం గుర్తుంచుకోవాలన్నారు.ఈ రోజు తాను దేశవాసులు, రైతుల ముందు వాళ్లు చేసిన పనులను చెప్పాలనుకుంటున్నానని అన్నారు.

తమ ప్రభుత్వం కనీస మద్దతు ధర(MSP) తొలగిస్తది అంటూ అసత్యప్రచారం చేస్తున్నారని మోడీ అన్నారు. MSPని మేము తొలగించాలనుకుంటే స్వామినాథన్ కమిషన్ నివేదికను ఎందుకు అమలు చేస్తాము? మా ప్రభుత్వం MSP గురించి సీరియస్ గా ఉంది, అందుకే ప్రతి సంవత్సరం సీజన్ ముందు మేము దీనిని ప్రకటిస్తాము. ఇది రైతులకు గణనలను సులభతరం చేస్తుంది. ఈ విపక్ష నాయకులు ఎంత క్రూరంగా ఉంటారనే దానికి స్వామినాథన్ కమిషన్ నివేదిక అతిపెద్ద రుజువు. ఈ వ్యక్తులు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ సిఫారసులపై 8 సంవత్సరాలు కూర్చున్నారు … తమ ప్రభుత్వం రైతుల కోసం ఎక్కువ ఖర్చు చేయనవసరం లేదని వారు నిర్ణయించారు. కాబట్టి వారు నివేదికను మూటగట్టిపక్కనబడేశారు అని మోడీ తెలిపారు.

వ్యవసాయ చట్టాలు…రాత్రికి రాత్రే తీసుకొచ్చినవి కాదని, 20-30 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ సంస్కరణలపై పూర్తిస్థాయి చర్చలు జరిగాయని గుర్తు చేశారు. వ్యవసాయ రంగ నిపుణులు, ఆర్థిక వేత్తలు, రైతు సంఘాలు ఎన్నో ఏళ్లుగా సంస్కరణలు కోరుకుంటున్నారని మోడీ అన్నారు. రైతులతో అన్ని ఇష్యూస్ పై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.