Pet Cat Dies : పెంపుడు పిల్లి మృతి.. మళ్లీ బతికొస్తుందని రెండు రోజులు మృతదేహంతోనే గడిపింది.. చివరికి..

ఇంట్లోని గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది పూజ. కూతురు ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కంగారు పడిన తల్లి గది దగ్గరికి వెళ్లింది.

Pet Cat Dies : ఉత్తరప్రదేశ్ లో అమ్రోహా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెంపుడు పిల్లి మరణించడంతో దాని యజమాని తీవ్ర మనస్తాపం చెందింది. నువ్వు లేకుండా నేను లేను అంటూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే, అంతకుముందు.. మరణించిన పిల్లి మళ్లీ బతికి వస్తుందనే ఆశతో దాని మృతదేహంతో రెండు రోజుల పాటు గడిపింది ఆమె. కానీ, అలా జరగలేదు. తన ఆశలు ఆవిరి కావడంతో మూడవ రోజు తీవ్ర నిర్ణయం తీసుకుంది. యజమానురాలు ఆత్మహత్య చేసుకుంది.

హసన్ పూర్ లో నివాసం ఉండే పూజ (32) సుమారుగా ఎనిమిదేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే, రెండేళ్లకే దంపతులు విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి పూజ తన తల్లితో కలిసి ఉంటోంది. భర్తతో విడిపోయాక పూజ ఒంటరిగా ఉండేది. ఒంటరితనం నుంచి బయటపడేందుకు పూజ ఒక పిల్లిని పెంచుకుంటోంది.

ఆ పిల్లికి ఆమె ఎంతో దగ్గరైంది. దాని మీద చాలా ప్రేమ పెంచుకుంది. తన సొంత బిడ్డలా చూసుకునేది. అయితే, ఊహించని విధంగా పిల్లి చనిపోయింది. దాంతో పూజ తీవ్ర మనస్తాపం చెందింది. పిల్లి మృతదేహాన్ని పూడ్చి పెట్టాలని పూజ తల్లి చెప్పింది. కానీ, పూజ అందుకు నిరాకరించింది. పిల్లి మళ్లీ బతికొస్తుందని తల్లితో వాదించింది. అంతేకాదు పిల్లి మృతదేహాన్ని రెండురోజుల పాటు ఇంట్లోనే ఉంచుకుంది. దాంతోనే గడిపింది.

తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లి మరణంతో పూజ మనస్తాపం చెందింది. ఈ క్రమంలో తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. పిల్లి మరణించిన మూడో రోజున ఆమె కూడా చనిపోయింది. శనివారం మధ్యాహ్నం తన ఇంట్లోని గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది పూజ. కూతురు ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కంగారు పడిన తల్లి గది దగ్గరికి వెళ్లింది.

కిటికీ నుంచి లోపలికి చూడగా ఆమె షాక్ కి గురైంది. పూజ సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. ఆమెకు సమీపంలోనే నేలపై పిల్లి మృతదేహం కూడా ఉంది. పూజ తల్లి భయంతో కేకలు వేసింది. ఆ కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. ఏం జరిగిందో తెలుసుకుని వారు కూడా షాక్ కి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.