అప్పటివరకు దేశంలో ఏ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయం: మాయావతి కీలక ప్రకటన

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని మాయావతి అన్నారు.

Mayawati

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదివారం లక్నోలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.

తమ పార్టీ దేశంలోని అన్ని ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయదని మయావతి అన్నారు. ముఖ్యంగా యూపీ ఉప ఎన్నికల్లో పోటీ చేయదని తెలిపారు. ఉప ఎన్నికలలో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేంత వరకు తాము పోటీ చేయబోమని స్పష్టం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని మాయావతి అన్నారు. నవంబరు 20న ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ సీట్లలో జరిగిన ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి బీఎస్పీ పోటీ చేసింది. వాటిల్లో బీఎస్పీ ఒక్కటి కూడా గెలవలేదు.

దీంతో, ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లు, నిన్న ప్రకటించిన ఫలితాలపై సర్వత్రా చర్చ జరుగుతోందని మాయావతి అన్నారు. ఉపఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న విషయంపై బహిరంగంగానే చర్చ జరుగుతోందని తెలిపారు.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూడా ప్రశ్నార్థకమవుతున్నాయని మాయావతి చెప్పారు. దేశానికి ఇది ఆందోళనకరమైన పరిస్థితిలాంటిదని తెలిపారు. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కొన్ని కఠినమైన చర్యలు తీసుకునే వరకు, తమ పార్టీ ఏ ఉప ఎన్నికల్లో పోటీ చేయదని నిర్ణయించిందని తెలిపారు.
Hemant Soren: జార్ఖండ్ సీఎంగా 26న ప్రమాణ స్వీకారం చేయనున్నహేమంత్ సోరెన్.. ఎవరెవరు హాజరవుతారంటే?