వరల్డ్ ఫుడ్ డే : రైతులపై మోడీ ప్రశంసలు…75రూపాయల నాణెం రిలీజ్

World Food Day 2020 ఇవాళ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ)75వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటుచేసిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్((FAO) 75 వ వార్షికోత్సవం సందర్భంగా…భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 రూపాయల స్మార‌క నాణాన్ని విడుదల చేశారు. FAOతో భారతదేశానికి ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని గుర్తుచేస్తూ స్మారక నాణాన్ని శుక్రవారం విడుదల చేశారు మోడీ. ప్రత్యేకమైన ఈ కాయిన్ ప్రజలకు అందుబాటులో ఉండదు.



అదేవిధంగా,ఇవాళ (అక్టోబర్-16,2020)ప్రపంచ ఆహార దినోత్సవం కూడా. ఇటీవల అభివృద్ధి చేసిన 17 ర‌కాల బయోఫోర్టిఫైడ్ పంటలను ఈ సందర్భంగా మోడీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా వర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ ఈ ఏడాది నోబెల్ శాంతి బ‌హుమ‌తి గెల్చుకోవడం గొప్ప విష‌య‌ని మోడీ ప్రశంసించారు. ఆహార స‌ర‌ఫ‌రా విష‌యంలో భార‌త పాత్ర‌, భాగ‌స్వామ్యం చ‌రిత్రాత్మకమైంద‌న్నారు. బలహీన వర్గ ప్రజలను , ఆర్థికంగా, పౌష్టికంగా బలంగా మార్చడంలో ఎఫ్ఏఓ ప్రయాణం అసమానమైనదన్నారు. 2016 లో అంతర్జాతీయ పప్పుధాన్యాలు సంవత్సరంగా ప్రకటించిన సంస్థ, 2023 ని ఇంట‌ర్నేష‌న‌ల్ ఇయ‌ర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ప్ర‌క‌టించింద‌ని, దీనికి భార‌త మ‌ద్ద‌తు పూర్తిగా ఉంటుంద‌ని ప్రధాని తెలిపారు.

కరోనా కారణంగా తతెల్లిన ఆహార,ఆరోగ్య సంక్షోభం ఉన్నప్పటికీ భారత్ ఏ విధంగా ఫుడ్ సెక్యూరిటీ(ఆహార భద్రత)ని విజయవంతంగా సాధించిందనే విషయాన్ని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కరోనా సమయంలో చాలా దేశాలు తమ ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో ఇబ్బందులెదుర్కొంటున్న సమయంలో…భారతీయ రైతులు… గతేడాది ఆహార ఉత్పత్తుల రికార్డును బ్రేక్ చేశారన్నారు. గతేడాది కంటే రికార్డు స్థాయిలో ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారన్నారు.



అంతేకాకుండా, అత్యవసర వ్యవసాయ సరుకుల ఎగుమతి 40శాతానికిపైగా పెరిగినట్లు మోడీ తెలిపారు. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం,పోషకాలతో కూడా మంచి ఆహారం అందించడానికి వరల్డ్ ఫుడ్ డే ఒక ముఖ్యమైన ఆవిష్కరణ అని మోడీ తెలిపారు. ఈ కార్యక్రమం వ్యవసాయం మరియు న్యూట్రిషన్ కు ప్రభుత్వం ఇచ్చిన అత్యధిక ప్రాధాన్యతను సూచిస్తుందని తెలిపారు. అధేవిధంగా పూర్తిగా ఆకలి కేకలు లేకుండా,పోషకాహార లోపం లేకుండా పరిష్కరించే ఓ టెస్టమెంట్ అని మోడీ తెలిపారు.



ఈ సందర్భంగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయాలను పెంచేందుకు ఉపకరిస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.. దేశ ఆహారభద్రతకు మద్దతు ధర, ఆహారోత్పత్తుల సేకరణ కీలకమని చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల్లో మెరుగైన సదుపాయాలతో వీటి నిర్వహణ చేపట్టడం అవసరమని నొక్కిచెప్పారు. ఈ విధానాన్ని కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మద్దతు ధర విధానం కొనసాగిస్తూనే రైతులు వారి ఉత్పుత్తుల విక్రయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులను బలోపేతం చేసేందుకు ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనేజేషన్స్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.