మహిళలు, ఆడపిల్లల రక్షణలో ఏపీ భేష్, జీరో ఎఫ్ఐఆర్ : అత్యాచారాలపై కేంద్రం మార్గదర్శకాలు

  • Publish Date - October 11, 2020 / 11:33 AM IST

zero fir registration  : మహిళలు, ఆడపిల్లల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణలో జరిగిన ‘దిశ’ ఘటన జరిగిన తర్వాత..ఏపీ అలర్ట్ అయ్యింది. కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావించింది.



అందులో భాగంగా..దిశ పేరిట ఓ చట్టం తీసుకొచ్చంది. దిశ పోలీస్‌ స్టేషన్‌లు, సైంటిఫిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఫలితంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్మార్గులకు 21 రోజుల్లోనే శిక్షలు పడేలా కృషి చేస్తోంది. ఇలాగే చట్టాలు తీసుకరావాలని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి.



ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హాథ్రస్‌ హత్యాచార ఘటన నేపథ్యంలో కేంద్రం సీరియస్ అయ్యింది. మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ చట్టాలను అనుసరించి కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..



మహిళలపై నేరాలు.. ప్రధానంగా అత్యాచారం వంటి కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. లైంగిక దాడి వంటి ఘటనల్లో తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి.
ఒకవేళ నేరం బాధితురాలుండే పోలీస్‌స్టేషన్‌ పరిధి వెలుపల జరిగితే.. ఎక్కడైనా సరే ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ నమోదు చేయాల్సిందే. లేకపోతే సదరు పోలీస్‌ అధికారి శిక్షార్హుడు. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో ఇది అమలవుతున్న సంగతి తెలిసిందే.



24 గంటల్లోగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. న్యాయాధికారి ముందు రికార్డు చేయనప్పటికీ.. బాధితురాలి మరణ వాంగ్మూలం పరిగణనలోకి తీసుకోవాలి.
లైంగిక దాడుల కేసుల్లో సాక్ష్యాలను సేకరించేందుకు సెక్సువల్‌ అసెల్ట్‌ ఎవిడెన్స్‌ కలెక్షన్‌ కిట్లను ఉపయోగించాలి.
అత్యాచార కేసుల్లో పోలీసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తి చేయాలి.



దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు సహకారం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌’ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తెచ్చింది.
ఒకవేళ..ఈ మార్గదర్శకాలు పాటించని పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్గదర్శకాల్లో వెల్లడించింది.