International Kissing Day: లాంగెస్ట్ కిస్ రికార్డ్ తొలగించిన గిన్నీస్.. కిస్సింగ్ రూల్స్ కనుక చూస్తే దిమ్మతిరిగిపోతుంది

ఒక సంవత్సరం క్రితం ఇద్దరు థాయ్ పురుషులు క్రియేట్ చేసిన రికార్డును (50 గంటల 25 నిమిషాలు) నాలుగు జంటలు బద్దలు కొట్టాయి. ఇంతకు ముందు 2011లో ఒకసారి రికార్డు సృష్టించిన ఎక్కాచై-లక్సానా జంట.. ఆ రికార్డును తిరగరాసి మరోసారి ప్రపంచ నంబర్ వన్ రికార్డు సృష్టించింది

International Kissing Day: లాంగెస్ట్ కిస్ రికార్డ్ తొలగించిన గిన్నీస్.. కిస్సింగ్ రూల్స్ కనుక చూస్తే దిమ్మతిరిగిపోతుంది

Updated On : July 7, 2023 / 4:49 PM IST

International Kissing Day 2023: థాయ్‭లాండ్‭కు చెందిన ఎక్కచాయ్-లక్సానా అనే జంట ఏకంగా 58 గంటల 35 నిమిషాల పాటు సుదీర్ఘమైన ముద్దు పెట్టుకుని ప్రపంచ రికార్డు సాధించారు. రిప్లైవ్ నిర్వహించిన బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే ఈవెంట్‌లో ఈ ఘనత సాధించారు. థాయిలాండ్‌లోని పట్టాయాలో 12 ఫిబ్రవరి 2013న ప్రారంభమై ఈ ఈవెంట్ రెండు రోజులు కొనసాగి ప్రేమికుల రోజుతో ముగిసింది. ఈ పోటీలో తొమ్మిది జంటలు పాల్గొన్నాయి. దాదాపు అన్ని జంటలు గంటలకొద్ది ముద్దులు పెట్టుకున్నాయి. అయితే ఒక జంటమాత్రం కేవలం ఒక గంట 38 నిమిషాలు మాత్రమే ముద్దు పెట్టుకున్నాయి. భర్త ఎక్కువసేపు నిలబడలేకపోవడం వల్ల (వయసు 70) గంటన్నరకే ముగించాల్సి వచ్చిందట.

ఇక ఒక సంవత్సరం క్రితం ఇద్దరు థాయ్ పురుషులు క్రియేట్ చేసిన రికార్డును (50 గంటల 25 నిమిషాలు) నాలుగు జంటలు బద్దలు కొట్టాయి. ఇంతకు ముందు 2011లో ఒకసారి రికార్డు సృష్టించిన ఎక్కాచై-లక్సానా జంట.. ఆ రికార్డును తిరగరాసి మరోసారి ప్రపంచ నంబర్ వన్ రికార్డు సృష్టించింది. వీనిరి 100,000 థాయ్ బాట్ల నగదు (3,300 అమెరికా డాలర్లు), 100,000 భాట్ల విలువైన రెండు డైమండ్ రింగ్‌ల గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నారు.

Ekkachai and Laksana Tiranarat

అయితే, గిన్నీస్ రికార్డులో నమోదైన ఈ రికార్డును చెరిపివేస్తున్నారట. అది కూడా ప్రపంచ ముద్దుల దినోత్సవరం (జూలై 7) రోజునే దీన్ని చెరిపేస్తుండడం గమనార్హం. పోటీ చాలా ప్రమాదకరంగా ఉందని, దానికి తోడు కొన్ని నియమాలు తమ ప్రస్తుత విధానాలకు విరుద్ధంగా ఉన్నందున ఇలా చేస్తున్నట్లు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది.

ఛాలెంజర్‌లందరూ అనుసరించాల్సిన రికార్డ్ నియమాలు:
* ముద్దు నిరంతరాయంగా ఉండాలి, పెదవులు ఎల్లప్పుడూ తాకాలి. పెదవులు విడిపోతే, ఆ జంట వెంటనే అనర్హులు.
* పోటీదారులు ప్రయత్నించే సమయంలో గడ్డి ద్వారా ద్రవాలను తినవచ్చు, కానీ పెదవులు విడిపోకూడదు.
* జంట ఎల్లవేళలా మెలకువగా ఉండాలి.
* ప్రయత్న సమయంలో పోటీదారులు తప్పనిసరిగా నిలబడాలి. ఎవరి సహాయమూ తీసుకోకూడదు.
* విశ్రాంతి, విరామాలు అనుమతించబడవు.
* అడల్ట్ న్యాపీలు/డైపర్‌లు లేదా ఇన్‌కంటినెన్స్ ప్యాడ్‌లు ధరించకూడదు.
* జంటలు మరుగుదొడ్డి వినియోగించినప్పుడు కూడా ముద్దు పెట్టుకోవడం తప్పనిసరి. ఆ సమయంలో రిఫరీ పర్యవేక్షణలో వారిని ఉంచాలి.

Nonthawat Charoenkaesornsin and Thanakorn Sitthiamthong

అయితే అ సుదీర్ఘ చుంబనాలు అనారోగ్యానికి, కొన్నిసార్లు ప్రాణాల మీదకు కూడా వస్తున్నాయి. దీనికి విరామ సమయం ఇవ్వనందున ఈ పోటీలో పాల్గొనేవారు నిద్ర లేమితో సంబంధం ఉన్న సైకోసిస్ వంటి ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంది. గతంలో నిర్వహించిన పోటీల్లో అనారోగ్య ప్రభావాలను ఎదుర్కొన్న అనేక సందర్భాలు ఇప్పటికే ఉన్నాయి. ఉదాహరణకు, 1999లో కర్మిత్ జుబెరా-ద్రోర్ ఓర్పాజ్ (ఇజ్రాయెల్) అనే జంట.. 30 గంటల 45 నిమిషాల పాటు ముద్దుపెట్టుకున్న తర్వాత స్పృహ కోల్పోయారు. పోటీలో గెలిచిన తర్వాత వారు దాదాపు మూర్ఛపోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సి వచ్చింది. అప్పుడు వారికి 2,500 డాల్లర్ నగదు బహుమతి లభించింది.

ఇక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు లేకపోలేదు. 2004లో 37 ఏళ్ల ఆండ్రియా సార్టీ (ఇటలీ) తన స్నేహితురాలు అన్నా చెన్ (థాయ్‌లాండ్)ని 31 గంటల 18 నిమిషాల పాటు ముద్దుపెట్టుకున్న తర్వాత ఆక్సిజన్‌లేమితో ప్రాణం పోసుకోవాల్సి వచ్చింది. ముద్దు పెడుతున్న సమయంలో అతడికి కండరాల తిమ్మిరితో సమస్య ఎక్కువైంది. అదే ప్రాణాల మీదకు వచ్చింది. 2011లో ఒక పోటీలో పాల్గొన్న ఒక మహిళ కేవలం 30 నిమిషాలకే మరణించింది.

James Belshaw and Sophia Severin

ప్రపంచ రికార్డు సాధించిన పొడవైన ముద్దు చరిత్ర ఇదీ..
మార్చి 1998: న్యూయార్క్ నగరంలో జరిగిన ‘బ్రీత్ సేవర్స్ లాంగెస్ట్ కిస్ ఛాలెంజ్’లో అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన మార్క్, రాబర్టా గ్రిస్‌వోల్డ్ 29 గంటలపాటు నిరంతరం ముద్దుపెట్టుకున్నారు.
ఏప్రిల్ 1999: ఇజ్రాయెల్‌లోని టెల్-అవీవ్‌లో 30 గంటల 45 నిమిషాల పాటు ముద్దుపెట్టుకుని ఇజ్రాయెల్ జంట కర్మిత్ ట్జుబెరా-డ్రోర్ ఓర్పాజ్ ముద్దుల పోటీలో విజేతలుగా నిలిచారు. పైన చెప్పినట్లు ముద్దుపెట్టుకుని మూర్చపోయిన జంట వీరే.
డిసెంబర్ 2001: అమెరికన్ జంట లూయిసా అల్మెడోవర్(19) రిచ్ లాంగ్లీ(22) న్యూయార్క్ నగరంలోని రికీ లేక్ టాక్ షో టెలివిజన్ స్టూడియోలో 30 గంటల 59 నిమిషాల పాటు పెదాలను లాక్ చేసుకున్నారు.
ఫిబ్రవరి 2004: ఇటాలియన్ లారీ డ్రైవర్ ఆండ్రియా సర్టి, అతని స్నేహితురాలు థాయిలాండ్‌కు చెందిన అన్నా చెన్.. ఇటలీలోని విన్సెంజాలో జరిగిన పోటీలో 31 గంటల 18 నిమిషాల పాటు ముద్దుపెట్టుకున్నారు.
జూలై 2005: ఆంగ్ల జంట జేమ్స్ బెల్షా-సోఫియా సెవెరిన్ లండన్‌లోని ప్లాజా షాపింగ్ సెంటర్‌లో 31 గంటల 30 నిమిషాల పాటు నిరంతరం ముద్దుపెట్టుకున్నారు.
ఫిబ్రవరి 2009: జర్మనీలోని హాంబర్గ్‌లోని హాంబర్గర్ హాఫ్ షాపింగ్ సెంటర్‌లో జర్మనీకి చెందిన నికోలా మాటోవిక్-క్రిస్టినా రీన్‌హార్ట్ 32 గంటల 7 నిమిషాల పాటు ముద్దుపెట్టుకున్నారు.
ఫిబ్రవరి 2011: థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో లూయిస్ టుస్సాడ్స్ వాక్స్‌వర్క్స్ నిర్వహించిన కార్యక్రమంలో వివాహిత థాయ్ జంట ఎక్కచాయ్-లక్సానా తిరానారత్ 46 గంటల 24 నిమిషాల పాటు ముద్దుపెట్టుకున్నారు.
ఫిబ్రవరి 2012: ఈ రికార్డు కలిగి ఉన్న ఏకైక స్వలింగ సంపర్కులు నోంథావత్ చారోన్‌కేసోర్న్సిన్-థానకోర్న్ సిథియామ్‌థాంగ్. రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నిర్వహించిన ఈవెంట్‌లో 50 గంటల 25 నిమిషాల పాటు వీరు ముద్దుపెట్టుకున్నారు.
ఫిబ్రవరి 2013: ఎక్కాచై-లక్సానా తిరనారత్ 58 గంటల 35 నిమిషాల పాటు ముద్దుపెట్టుకుని ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డ్ నెలకొల్పారు. అయితే పైన పేర్కొన్న విధంగా వీరి రికార్డును గిన్నీస్ తొలగించింది.