రైతులు పత్తి పంట ఎక్కువ విస్తీర్ణంలో పండించాలి : సీఎం కేసీఆర్

  • Publish Date - May 18, 2020 / 03:42 PM IST

తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంటకు అద్భుతమైన భవిష్యత్‌ ఉందని…. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలే  రైతులు వేయాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. 70 లక్షల ఎకరాల్లో పత్తిపంటను పండించాలని ఆయన అన్నారు. సోమవారం ప్రగతి భవన్ లో సమావేశమైన తెలంగాణ కేబినెట్ లాక్ డౌన్ 4 సడలింపులు, రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించింది. 

కేబినెట్ భేటీ  అనంతరం విలేకరులతో మట్లాడుతూ సీఎం కేసీఆర్ ..గతంలో 53 లక్షల ఎకరాల్లో పత్తి పండించారు..ఈసారి 70 లక్షల ఎకరాల్లో వేయాలి.  ప్రభుత్వం చెప్పినట్లు పంటలు వేసి మంచి ధరను రైతు పొందాలి. వ్యవసాయంలో మనం అన్ని రికార్డులను బద్ధలుకొడుతున్నాం. పాలిహౌజ్‌, గ్రీన్‌హౌజ్‌ కల్టివేషన్‌కు సబ్సిడీలు ఇస్తున్నామని’ సీఎం వివరించారు. కరోనా వల్ల ఈ ఏడాది వరి ధాన్యాన్ని కొన్నాము.. కానీ పంటలు కొనడం ప్రభుత్వ విధానం కాదని ఆయన అన్నారు.

ఇప్పుడు రైతులంతా విడిపోయి ఉన్నారు. కానీ సంఘటితం అయితే దేనినైనా సాధించగలం. రాబోయే 15 రోజులలో ప్రతి జిల్లా అధికారులు వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే చేస్తారు. మన రాష్ట్రంలో ఎకరా పత్తి వేస్తే దాదాపు 50 వేల రూపాయల లాభం వస్తుంది. అదేవిధంగా ఒక ఎకరాలో వరి పంట వేస్తే 25 వేల రూపాయల గరిష్టంగా మిగులుతుంది. కనుక పత్తి పంటలో అధిక లాభాలను గడించవచ్చు.

గత ఏడాది 53 లక్షల ఎకరాలలో పత్తి పంట వేశాం. ఈసారి 70 లక్షల ఎకరాల దాకా పత్తి సాగు చేయాలి. 40 లక్షల ఎకరాలలో వరి సాగు చేయవచ్చు. ఇందులో దొడ్డు రకాలు.. సన్న రకాల ధాన్యం గురించి అధికారులు నిర్ణయిస్తారు. 12 లక్షల ఎకరాలలో కంది పంట సాగు చేద్దాం.. కందులను రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది.

ఈ వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దు. మొక్కజొన్న సాగు చేస్తే రైతుబంధు వర్తించదు. కావాలంటే యాసంగి లో మొక్కజొన్న వేయండి.  ఎనిమిది నుంచి పది లక్షల ఎకరాలలో మిర్చి, కూరగాయలు, సోయా, పప్పు ధాన్యాలు ఇతర పంటలు వేయండి. ప్రతి మండలంలోనూ పంటలు సాగు చేసేందుకు ఉండే యాంత్రిక శక్తి ఎంత అనే లెక్క మండల వ్యవసాయ అధికారితో ఉండాలి. రాబోయే రోజుల్లో యాంత్రిక సాయం పైనే వ్యవసాయం ఆధారపడుతుంది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుంది’  అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు

రైతులకు ఉచిత నీటి సరఫరా ఒక్క తెలంగాణలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. కొన్ని రకాల అరుదైన పండ్లకు తెలంగాణ కేంద్రంగా ఉందని సీఎం తెలిపారు. తెలంగాణ అవతరించాక దేశ చరిత్రలో లేనివిధంగా రైతు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో అమలు చేసే పథకాలను అందరూ అనుసరిస్తున్నారని సీఎం తెలిపారు. 

‘నీటిపారుదల ప్రాజెక్టుల ఫలాలు మనం చూస్తున్నాం. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ తెలంగాణలో ఉంది.  వేలాది పాడిపశువులు పంపిణీ చేసి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం.  అధునాతన పద్ధతుల్లో పంటలు పండించేందుకు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాం.  5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదేనని  రైతాంగం నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలని కేసీఆర్ సూచించారు.