2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతోనే : AIADMK

AIADMK-BJP alliance : వచ్చే ఏడాది 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతోనే జతకడతామని అధికారిక పార్టీ AIADMK స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం తమ పార్టీ AIADMK బీజేపీ కూటమిలోనే కొనసాగుతుందని ధ్రువీకరించారు.
తమిళనాడులో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైన ప్రభుత్వ కార్యక్రమంలో ఈ అధికారిక ప్రకటన వెలువడింది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ఎక్కువ సీట్లు గెల్చుకుంటామని సీఎం పళని స్వామి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల Vetrivel యాత్ర వివాదంతో అన్నాడీఎంకే, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ వైఖరిపై అన్నాడీఎంకేలో వ్యతిరేకత నెలకొంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే బీజేపీ కూటమి నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపించాయి.
అన్నాడీఎంకే తాజా ప్రకటనతో వాటిన్నింటికి తెరపడినట్టయింది. తమిళనాడులో రూ.63,378 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించి ప్రారంభోత్సవానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమిత్ షా కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పన్నీరుసెల్వం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే రాష్ట్రానికి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని పళనిస్వామి అన్నారు.
2014 లోకసభ ఎన్నికల సమయంలోనే అన్నాడీఎంకే బీజేపీతో జత కడుతుందంటూ జోరుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ, ఒంటరిగా పోటీ చేసి 39 స్థానాలకు 37 సీట్లు గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసేసింది.