అమరావతి రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న బంద్

  • Publish Date - January 21, 2020 / 05:05 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో మంగళవారం బంద్ కొనసాగుతోంది. అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపుతో 29 గ్రామాల్లోని వ్యాపారులు స్వఛ్ఛందంగా బంద్ లో పాల్గోంటున్నారు. బంద్ సందర్భంగా పోలీసులకు పూర్తి సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించారు. మంచినీరుతో సహా ఏది పోలీసులకు అమ్మరాదని, పోలీసులు అడ్డుకుంటే జాతీయ జెండాలతో నిరసనలు తెలపాలని నిర్ణయించారు.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలునేడు 35వ రోజుకు చేరాయి. శాసనసభలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందినా రైతులు తమ నిరసనలు ఆపడంలేదు. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.

ఉద్దండరాయునిపాలెంలో రైతులు, మహిళలు నిరసన తెలుపుతూ పూజలు నిర్వహిస్తున్నారు. రాజధాని గ్రామాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు రాజధానిపై ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.


అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినప్పటికీ  తమ పోరాటం కొనసాగిస్తామని రైతులు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం వరకు రైతులు సీఆర్డీఏకు తమ వినతులు అందచేసే అవకాశం కోర్టు కల్పించిందని న్యాయస్ధానం తీర్పుకు విరుధ్ధంగా గడువుకు ముందే మంత్రి వర్గం వికేంద్రీకరణ బిల్లును ఎలా ఆమోదిస్తుందని వారు  ప్రశ్నించారు. రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే బిల్లు పాస్ చేయించారని దీనిపై న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

మరోవైపు రాజధాని గ్రామాల్లో పోలీసు పహారా కొనసాగుతోంది.  ప్రతి గ్రామానికిరెండు వైపులా  పోలీసులు మొహరించారు. సచివాలయానికి వెళ్లే మల్కాపురం  సెంటర్ లోనూ పోలీసులు భారీగా మొహరించారు.సచివాలయం వెనుక వైపు కూడా పోలీసు బందో బస్తుఏర్పాటు కొనసాగుతోంది.