అమరావతి రైతుల ఆందోళన ఉధృతం : వెలగపూడి, తుళ్లూరు వెళ్లనున్న నారా లోకేశ్‌

రాజధాని కోసం పోరుబాట పట్టిన అమరావతి రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. 22వ రోజు ఆందోళనలో భాగంగా ఇవాళ... మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహిస్తున్నారు రైతులు.

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 03:54 AM IST
అమరావతి రైతుల ఆందోళన ఉధృతం : వెలగపూడి, తుళ్లూరు వెళ్లనున్న నారా లోకేశ్‌

Updated On : January 8, 2020 / 3:54 AM IST

రాజధాని కోసం పోరుబాట పట్టిన అమరావతి రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. 22వ రోజు ఆందోళనలో భాగంగా ఇవాళ… మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహిస్తున్నారు రైతులు.

రాజధాని కోసం పోరుబాట పట్టిన అమరావతి రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. రాజధాని మార్పు ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటి నుంచి రగిలిపోతున్న రైతులు….మొన్నటివరకు శాంతియుతంగా నిరసనలు తెలిపారు. నిన్నమాత్రం వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చినకాకాని వద్ద నిర్వహించిన హైవే దిగ్బంధంతో విధ్వంసానికి దిగారు. ఎమ్మెల్యే వాహనంపై అటాక్‌ చేసి కలకలం రేపారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నా, అరెస్టులు చేసినా హైవే దిగ్బంధాన్ని సక్సెస్‌ చేసి చూపారు. అదే ఊపుతో ఇవాళ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

22వ రోజు ఆందోళనలో భాగంగా ఇవాళ… మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహిస్తున్నారు రైతులు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో పలు గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు.. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెంతోపాటు రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రకాశం, గోదావరి జిల్లాల్లోను ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి

రైతుల ఆందోళనలకు మద్దతిస్తున్న టీడీపీ… ఇవాళ వారి వద్దకు వెళ్లి సంఘీభావం తెలపనుంది. ఇందులో భాగంగా నారా లోకేష్.. వెలగపూడి, తుళ్లూరు వెళ్లి అక్కడి రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొననున్నారు. అయితే… నిన్నటి ఘటనలతో పోలీసులు కూడా అలర్టయ్యారు. రాజధాని ప్రాంతంలో బందోబస్తు పటిష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను రంగంలోకి దింపారు.

మరోవైపు… హైపవర్ కమిటి భేటీ తర్వాత రాజధానిపై స్పష్టత వస్తుందని  అనుకున్నా… అది జరగలేదు. జీఎన్‌రావు కమిటి, బోస్టన్‌ గ్రూపు రిపోర్టుపై అధ్యయనం చేసిన హైపవర్ కమిటి… తన నిర్ణయమేంటో అధికారికంగా ప్రకటించలేదు. కానీ… అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండకూడదని భావిస్తోందన్న ప్రకటనతో రాజధానిపై స్పష్టమైన సంకేతాలిచ్చినట్లేనని.. అధికార వికేంద్రీకరణకే హైపవర్ కమిటి మొగ్గు చూపుతున్నట్లు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రైతులు తమ పోరును మరింత ఉధృతం చేయబోతున్నారు.