నిరసన తెలిపితే ఓకే…ముట్టడిస్తాం..దాడులు చేస్తాం అంటే …… స్పీకర్ వార్నింగ్ 

  • Publish Date - January 19, 2020 / 10:52 AM IST

ఏపీ శాసన సభ సమావేశాలు జనవరి 20, సోమవారం  నుంచి జరుగనున్నాయి.  రేపటి నుంచి జరిగే సమావేశాలను అడ్డుకుంటామని,  అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ వంటి కొన్నిసంస్ధలు, చేస్తున్న ప్రకటనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. చట్టసభలను ముట్టడించటం, సభను జరగనివ్వకుండా అడ్డుకుంటే  అది సభాహక్కుల ఉల్లంఘనగా పరిగణించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రేపటి  నుంచి జరిగే శాసనసభ సమావేశాలపై ఆయన మాట్లాడుతూ  రాజధాని అంశంపై  చట్టాలకులోబడి ఎవరైనా నిరసన తెలిపుకోవచ్చని చెప్పారు. సభలను జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా..అవాంచనీయ సంఘటనలకు పాల్పడినా వారిని జైలుకు పంపే అధికారం శాసనసభకు ఉందని ఆయన వివరించారు. రాజ్యాంగబద్దమైన స్టేటస్ తో ఉన్న చట్టసభలలో సభ్యుల సమస్యలు సభలో ఎవరైనా చెప్పుకోవచ్చని, అంతే కాని దాడులు చేస్తాం. ముట్టడిస్తామనేది సరైన పద్ధతి కాదన్నారు. సభకు సభ్యులు రాకుండా అడ్డుకోవడం కూడా నేరమే అని, అలాంటి వారిపై చర్యలు తీసుకునే హక్కు సభకు ఉందని స్పీకర్‌ పేర్కొన్నారు.  

రాజ్యాంగంలోని 208  అధికరణ కింద చట్టసభల నిర్వహణలో తమకు సంబంధించిన అంశాలపై నియమాలను రూపోందించుకునే అవకాశం ఇచ్చిందని… శాసన సభ  354,355, 356 నియమాల సారంగా చట్టసభలోకి అగంతకులు ప్రవేశించకుండా నిరోధించే అధికారాలు కల్పించబడ్డాయని ఆయన వివరించారు నియమాలకు విరుధ్దంగా ఎవరైనా చట్టసభల ప్రాంగణంలోకి ప్రవేశిస్తే వారిని జైలుకు పంపే అధికారం  సబాపతికి ఉందని స్పీకర్ తమ్మినేని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని  అది చట్టాలకు లోబడి ఉండాలని ఆయన చెప్పారు. నిరసనకారులు రాజ్యంగ వ్యవస్ధకు వార్నింగ్ ఇస్తున్నారని ఇది  సరైన  పద్దతి కాదని ఆయన హితవు పలికారు.  రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు.

శాసన సభ నియమావళి ప్రకారం  సభ్యులైన వారు  తమ సమస్యను శాసన సభలో ఎలుగెత్తి చెప్పుకోవచ్చని..లేదా ప్రసార సాధనాల ద్వారా వారు చెప్పుకోవచ్చని ఆయన తెలిపారు. దాడులు చేస్తాం… ముట్టడిస్తాం అనేది సరైన పద్దతి కాదని ఆయన చెపుతూ…భావ స్వేఛ్చను హరించే హక్కు ఎవరికీ లేదు కానీ …అదేసమయంలో నేనేదైనా చేయొచ్చు అనుకుంటే  అది కుదరదు అని తమ్మినేని సీతారాం  హెచ్చరించారు. సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని స్పీకర్‌ తమ్మినేని కోరారు. 

ట్రెండింగ్ వార్తలు