ఉన్నవి రెండు. ఆ రెండింటిని అటు ఇటు ఇటు అటు మార్చి సీట్లు ఫిల్ చేయాలి. అదే సమయంలో ప్రమోషన్లు ఇవ్వాలి. ఇదే ప్రస్తుతం జగన్ మదిలో ఉన్న ఆలోచన. ముహూర్తం ఫిక్స్ చేసినంత ఈజీగా సమీకరణాలు తేల్చయడం కుదరదు. సీనియర్లు, కొత్త కొత్త సమీకరణాలతో ప్లానింగ్ సిద్ధం చేసుకుని మరీ పార్టీ పెద్దల ముందు క్యూ కట్టేస్తున్నారు. మరి ఎవరికి దక్కుతుందో ప్రమోషన్? ఎవరు కొట్టేస్తారో బంపర్ ఆఫర్?
జోగి రమేశ్, పొన్నాడ సతీశ్ పేర్లు బలంగా వినిపించాయి:
ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైపోయింది. శ్రావణమాసం మొదటి రోజు జూలై 22న విస్తరణ చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఖాళీ అయిన రెండు మంత్రి పదవులు ఎవరితో భర్తీ చేస్తారనే దానిపై ఇప్పుడు పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీ నుంచి ప్రభుత్వ వర్గాల వరకూ రోజు రోజుకి కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు స్థానాలు బీసీ వర్గాలకే ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకోసం ఆ సామాజికవర్గ నేతల్లో సీనియర్లు, జూనియర్లయిన చాలామంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. మొదట్లో జోగి రమేశ్, పొన్నాడ సతీశ్ పేర్లు బలంగా వినిపించాయి. తాజాగా వీటితో పాటు మరికొన్ని పేర్లు పార్టీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
రేసులో తమ్మినేని, మాడుగుల:
మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మరో ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరు స్పీకర్ తమ్మినేని సీతారాం, మరొకరు మాడుగుల ముత్యాలనాయుడు. వీరిద్దరూ ఉత్తరాంధ్రలో బీసీ సామాజికవర్గానికి చెందినవారే. వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. స్పీకర్ తమ్మినేనికి కనుక అవకాశం ఇస్తే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కోన రఘుపతికి స్పీకర్‌గా ప్రమోట్ చేస్తారని టాక్. ఎలాగో గుంటూరుకు మంత్రి పదవి దక్కే అవకాశం లేనందున ఈ కీలక పదవి ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నారంటున్నారు. దానికి తోడు బ్రాహ్మణ సామాజికవర్గానికి మంచి స్థానం ఇచ్చినట్లు అవుతుందనేది అధినేత అభిప్రాయంగా చెబుతున్నారు.
అసలు జగన్ మైండ్ లో ఏముంది?
వీరు కాకుండా ఇంకా చాలా మంది ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. వారికి పరిచయం ఉన్న పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎవరూ ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. జగన్ మైండ్‌లో ఏముంటే అదే జరుగుతుందని భావిస్తున్నారు. మొత్తానికి మంత్రి పదవుల భర్తీ విషయంలో ఈ కొత్త సమీకరణాలు తెరపైకి రావడంతో అసలు అవకాశం ఎవరికి దక్కుతుందో అని పార్టీలో ఉత్కంఠ నెలకొంది. మరి ఆ చాన్స్ జగన్ ఎవరికి ఇస్తారో చూడాలని కార్యకర్తలు అంటున్నారు.