ఏపీ ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తన బాధ్యతల నుంచి బుధవారం రిలీవ్ అయ్యారు. ఆయన తన బాధ్యతలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు అప్పగించారు. ఇకపై నీరబ్ కుమార్ ప్రసాద్ ఇన్చార్జి సీఎస్ గా వ్యవహరించనున్నారు. నీరభ్‌కుమార్ ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించిన అనంతరం ఆయన దీర్ఘకాలిక సెలవులో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీ కొత్త సీఎస్ గా 1984 ఐఏఎస్ కేడర్ కు చెందిన నీలం సహానీ ని నియమించనున్నట్లు తెలుస్తోంది. నీలం సహానీ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ప్రస్తుతం ఆమె కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు 2020 జూన్ 30 వరకు పదవీ కాలం ఉంది. అయితే ఆమె కేంద్ర సర్వీస్‌ల నుంచి రిలీవ్ అయి రాష్ట్రానికి వచ్చేందుకు మరో వారం లేదా పది రోజుల వ్యవధి పడుతుందని భావిస్తున్నారు.