TDP Ticket War : టీడీపీలో కొత్త తరహా రాజకీయం.. ఎలాంటి నష్టం జరుగుతుందో అనే ఆందోళనలో అధిష్టానం

క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీలో ఈ కొత్త తరహా రాజకీయం కొంప ముంచే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Ticket War In Anantapur Dist TDP

TDP Ticket War : అనంతపురం టీడీపీలో అసమ్మతి చల్లారడం లేదు. టికెట్లు ప్రకటించి వారం రోజులు దాటుతున్నా.. అసంతృప్తి అగ్గి రాజుకుంటూనే ఉంది. కల్యాణదుర్గం నియోజకవర్గంలో మొదలైన లొల్లి ఇప్పుడు పెనుగొండ, సింగనమల, మడకశిర వరకు పాకింది. ఇలా ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. నాలుగు నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి.

టీడీపీకి తిరుగులేని స్థానాల్లో తీవ్ర వ్యతిరేకత..
తెలుగుదేశం పార్టీ తొలి జాబితాతో రేగిన అగ్గి ఇంకా చల్లారడం లేదు. ముఖ్యంగా ఆ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనే ఎక్కువ లొల్లి జరుగుతోంది. రాయలసీమలో టీడీపీకి కంచుకోటగా చెప్పే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం పరిస్థితులు గమనిస్తే.. అభ్యర్థుల ఎంపికలోనే తప్పులో కాలేసినట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యమైన నాలుగు నియోజకవర్గాల్లో టికెట్‌ దక్కించుకున్న నేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అక్కడి కేడర్‌. ఇందులో టీడీపీకి తిరుగులేని స్థానాలుగా చెప్పే పెనుకొండ, మడకశిర, సింగనమల వంటి నియోజకవర్గాలు ఉండటం విస్తృత చర్చకు దారితీస్తోంది.

తలనొప్పిగా మారిన నాన్ లోకల్ వ్యవహారం..
గత నెలలో టికెట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే కల్యాణదుర్గంలో అసంతృప్తి పెల్లుబుకింది. గత ఐదేళ్లుగా కల్యాణదుర్గం టికెట్‌ ఆశించి నియోజకవర్గంలో పనిచేస్తున్న రెండు వర్గాలకు చెక్‌ పెడుతూ మూడో వ్యక్తిని తెరపైకి తెచ్చింది టీడీపీ అధిష్టానం. దీంతో కంగుతిన్న రెండు వర్గాల వారు ఒక్కటై.. ఇస్తే తమలో ఒకరికి టికెట్‌ ఇవ్వాలని పార్టీ అగ్రనాయత్వానికి అల్టిమేటమ్‌ జారీ చేశారు. ప్రస్తుతం కల్యాణదుర్గం అభ్యర్థిగా ప్రకటించిన సురేంద్రబాబు స్థానికేతరుడని.. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు పార్టీ స్థానిక క్యాడర్‌.

Also Read : టీడీపీ 25, జనసేన 10..! కూటమి సెకండ్ లిస్ట్ రెడీ..!

టికెట్ విషయంలోచంద్రబాబుతోనే తేల్చుకుంటానన్న సీనియర్ నేత..
ఇక ఎప్పటినుంచో నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న సీనియర్‌ నేత హనుమంతరాయ చౌదరి, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఉమామహేశ్వరనాయుడిని పక్కన పెట్టింది పార్టీ. ఈ పరిస్థితుల్లో అసమ్మతులను దారికి తెచ్చుకోడానికి అభ్యర్థి సురేంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా సీనియర్‌ నేత హనుమంతరాయ చౌదరిని కలిసి మద్దతు కోరితే.. టికెట్‌ విషయమై తాను చంద్రబాబుతో తేల్చుకుంటానని.. అంతవరకు తనను కలవొద్దని.. ఎలాంటి మాట ఇవ్వలేనని పార్టీ అభ్యర్థి సురేంద్రబాబు ముఖం మీదే చెప్పేశారు హనుమంతరాయ చౌదరి.

ఇక మరో కీలక నియోజకవర్గం పెనుగొండలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెనుగొండ సీటును మాజీ ఎంపీ బీకే పార్థసారథి ఆశిస్తే.. ఆయనను కాదని సవితమ్మకు టికెట్‌ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. పార్ధసారథికి అనంతపురం ఎంపీ టికెట్‌ ఇస్తామని చెప్పినా, ఆయన వినడం లేదంటున్నారు. ఈ నెల 4న పెనుగొండలో రా కదలిరా సభకు వచ్చిన చంద్రబాబు.. పార్థసారధితో మాట్లాడినా, ఆయన తగ్గలేదంటున్నారు.

శింగనమలలో పార్టీపై అసమ్మతుల తీవ్ర ఒత్తిడి..
ఇక శింగనమలలో అసమ్మతులు పార్టీపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇక్కడ అభ్యర్థిగా బండారు శ్రావణిశ్రీని ఎంపిక చేసింది పార్టీ. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన ఇక్కడ టూ మెన్‌ కమిటీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఈ టూ మెన్‌ కమిటీలో సభ్యులైన ముంతిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు పార్టీ అభ్యర్థి శ్రావణశ్రీని వ్యతిరేకిస్తున్నారు. శ్రావణిశ్రీకి జేసీ బ్రదర్స్‌ అండదండలు ఉన్నాయంటున్నారు. ఇలా రెండు వర్గాలు పంతానికి పోవడంతో ఎలా నెగ్గుకు రావాలనేదానిపై తర్జనభర్జన పడుతోంది పార్టీ.

ఈ కొత్త తరహా రాజకీయం కొంప ముంచే ప్రమాదం ఉందనే ఆందోళన..
ఇదేవిధంగా మడకశిరలోనూ అగ్గి రాజుకుంటోంది. మడకశిర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్‌ను ఎంపిక చేసింది పార్టీ. ఐతే సునీల్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి బీసీ నేతలు ఏకంగా రోడ్డెక్కుతున్నారు. ఓ కార్యకర్త ఆత్మాహుతికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. ఇలా మొత్తం నాలుగు నియోజకవర్గాల్లోనూ రాజకీయం గరం గరంగా మారడంతో తలపట్టుకుంటోంది పార్టీ అగ్రనాయకత్వం. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీలో ఈ కొత్త తరహా రాజకీయం కొంప ముంచే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులను మార్చుతారా? లేక సీనియర్లు, అసమ్మతులు, అసంతృప్తులతో చర్చించి దారికి తెస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

Also Read : పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ మాస్టర్ ప్లాన్..! కాపు నేతలపై స్పెషల్ ఫోకస్

ట్రెండింగ్ వార్తలు