మరోసారి విశాఖ పర్యటనకు చంద్రబాబు

  • Publish Date - March 3, 2020 / 05:54 PM IST

మొదటి సారి వెళ్లారు.. బెనిఫిట్‌ అయ్యింది.. రెండోసారీ ప్లాన్‌ చేసుకున్నారు. డబుల్‌ బెనిఫిట్‌ అవుతుందని. అంతా తాననుకున్నట్టే జరుగుతున్నప్పుడు ఎందుకు ప్లాన్‌ చేయరు.. తప్పకుండా చేసే తీరతారు. మొన్న వెళ్లినప్పుడు జరిగిన రచ్చకంటే ఈసారి ఇంకా ఎక్కువగా.. అంటే రచ్చరచ్చ జరగాలని కోరుకుంటున్నారేమో.. అప్పుడే కదా డబుల్‌ బెనిఫిట్‌ దక్కేది.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖపట్నంలో  ఇటీవల నిర్వహించాలనుకున్న ప్రజా చైతన్య యాత్ర రసాభాసగా మారి, రాజకీయ దుమారానికి కారణమైంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ నేతల తీరుతో టీడీపీ నేతలు కూడా బాహాబాహీకి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌పై, తాజా పరిణామాలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఆగామో అక్కడ నుంచే మళ్లీ యాత్ర మొదలుపెట్టాలని టీడీపీ నేతలు చాలా పట్టుదలతో ఉన్నారని అంటున్నారు. ఈ విషయంలో వెనక్కు తగ్గకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారట.  

చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు దగ్గర జరిగిన హైడ్రామాతో వేడెక్కిన విశాఖ నగరం… మరోసారి హాట్‌హాట్‌ చర్చకు కారణం అవుతోంది. వైసీపీ శ్రేణులు చంద్రబాబు విశాఖ పర్యటనను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నాయని, చంద్రబాబు గో బ్యాక్ నినాదాలు చేసింది కూడా వారేనని టీడీపీ పక్కాగా ఒక నిర్ణయానికి వచ్చేసింది. అందుకే మరోసారి చంద్రబాబు విశాఖ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. అదే సమయంలో చంద్రబాబు మరోసారి వస్తే ఏం చేయాలన్న దానిపై వైసీపీ నేతలు సైతం వ్యూహాలు రచిస్తున్నారని చెబుతున్నారు.

ఫిబ్రవరి 27న చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లగా వైసీపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్టు ఆవరణలోనే అడ్డగించారు. చంద్రబాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. చంద్రబాబును అడ్డుకున్నది వైసీపీ శ్రేణులని, పులివెందుల నుంచి వచ్చిన వారేనని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అది నిజం కాదని, వైజాగ్ రాజధానిగా వ్యతిరేకించిన చంద్రబాబును అక్కడ ప్రజలే బుద్ధి చెప్పారని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా కోర్టుకు కూడా వెళ్లారు. 

మరోపక్క, చంద్రబాబు మళ్లీ విశాఖ పర్యటన చేసి తీరతారని లోకేశ్‌ ప్రకటించారు. చంద్రబాబు విశాఖ పర్యటన జరిపి తీరాలని, ఆ పర్యటనను సక్సెస్ చేయాలని టీడీపీ నేతలు పక్కా వ్యూహాన్ని రచిస్తున్నారని అంటున్నారు. రోడ్డు మార్గంలో బాబు విశాఖ పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయట. ఫ్లైట్‌లో కాకుండా ట్రెయిన్ లేదా రోడ్డు మార్గంలో విశాఖకు రావాలని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. 

అందుకు అనుగుణంగా యాత్ర వ్యూహాన్ని రచించే బాధ్యతలను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అప్పగించారని చెబుతున్నారు. రోడ్డు మార్గంలో వస్తే మార్గమధ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చంద్రబాబుతో పాటుగా విశాఖకు తరలే అవకాశాలుంటాయి. అప్పుడు చంద్రబాబు యాత్రను అడ్డుకోవడం వైసీపీ శ్రేణులకు సాధ్యం కాదని టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. 

చంద్రబాబు విశాఖ పర్యటన వ్యూహానికి ప్రతివ్యూహంతో వైసీపీ సిద్దమవుతోంది. పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై దృష్టి పెట్టారట. చంద్రబాబు మరోసారి వైజాగ్‌కు వస్తారన్న ప్రచారంపై వైసీపీ నేతలతో విజయసాయిరెడ్డి చర్చలు జరిపారట. వైసీపీ కీలక నేతలతో భేటీ అయిన ఆయన.. చంద్రబాబు విశాఖ పర్యటనను మరోసారి అడ్డుకొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారని అంటున్నారు. టీడీపీ, వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు మరో మారు విశాఖలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠకు కారణమవుతోంది.