టీటీడీ పాలకమండలి బోర్డులో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం సెప్టెంబరు19న ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తోపాటు, చెన్నైకి చెందిన ఏజే శేఖర్‌రెడ్డి, రాకేష్ సిన్హా (ఢిల్లీ), కుపేందర్ రెడ్డి(బెంగుళూరు), గోవింద హరి (హైదరాబాద్), దుష్మంత్‌కుమార్ దాస్ (భువనేశ్వర్) , ఆమోల్ కాలే (ముంబై)లను నియమించారు.
ప్రత్యేక ఆహ్వనితులకు పాలకమండలి తీర్మానాలను ఆమోదించే సమయంలో ఓటు హక్కు ఉండదని ప్రభుత్వం పేర్కోంది. టీటీడీ సభ్యులతో సమానంగా వీరికి ప్రోటోకాల్ వర్తింప చేయనున్నట్లు ఆ జీవో లో పేర్కోన్నారు. సెప్టెంబర్ 18, బుధవారమే టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డికి తిరిగి అవకాశం లభించింది.
కాగా టీడీపీ హయాంలో ఏర్పాటైన గత టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి మళ్లీ జగన్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. దేశంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో శేఖర్ రెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయల కొత్త నోట్లు దొరికాయి. దాంతో అప్పట్లో శేఖర్ రెడ్డిపై కేసులు నమోదై వివాదాలు చుట్టుముట్టటంతో శేఖర్ రెడ్డి పాలకమండలి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సీఎం జగన్ హయాంలో శేఖర్‌రెడ్డికి పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా జగన్ చోటు కల్పించారు.