నవ్వులపాలు : లోకేష్ సభలో జగన్ బొమ్మలతో కుర్చీలు

  • Publish Date - February 9, 2019 / 08:02 AM IST

టీడీపీ భవిష్యత్ అధినేత, ఏపీ మంత్రి లోకేష్ కోసం ఎంతో ఆర్భాటంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభ నవ్వులపాలు చేసింది. ఏపీ స్టేట్ మొత్తం 4 లక్షల గృహప్రవేశాలను పండుగలా చేపట్టింది చంద్రబాబు సర్కార్. అందులో భాగంగా మంత్రి లోకేష్ తిరుపతికి వెళ్లారు. అక్కడ ప్రభుత్వం భారీ ఎత్తున బహిరంగ సభ చేపట్టింది. ఏర్పాట్లు కూడా ఆర్భాటంగానే ఉన్నాయి. వందల కుర్చీలు వేశారు. ఇక్కడే తేడా వచ్చింది. వాటిపై జగన్ స్టిక్కర్లు ఉన్నాయి. జగన్ కావాలి.. జగన్ రావాలి అనే స్లోగన్స్ కూడా ఉన్నాయి. సభలో ఏర్పాటు చేసిన చాలా కుర్చీలపై ఇలాంటి జగన్ బొమ్మలు దర్శనం ఇవ్వటం కలకలం రేపింది.

సభా నిర్వహకులు ఎవరూ కూడా దీన్ని పట్టించుకోలేదు. సభ ప్రారంభం అయ్యే సమయానికి కూడా గుర్తించలేదు. కొందరు మీడియా వాళ్లు గమనించి ఫొటోలు, వీడియోలు తీయటంతో అంతా కలకలం. అప్పుడుకానీ అసలు విషయాన్ని గుర్తించని అధికారులు.. ఆ వెంటనే పరుగులు పెట్టారు. జగన్ స్టిక్కర్లు ఉన్న కుర్చీలను సభ నుంచి తొలగించారు. మిగతా వాటిని కూడా పరిశీలించారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నవ్వులపాలు చేసింది. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహకులపై చిందులు వేశారు. ఇంత పెద్ద సభ జరుగుతుంటే.. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ చిర్రుబుర్రులాడారు. 

సేమ్ కుర్చీలు రిపీట్ :
నాలుగు రోజుల క్రితం తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం జరిగింది. ఆ సభలో ఈ కుర్చీలనే ఉపయోగించారు. వాటిపై జగన్ కావాలి.. జగన్ రావాలి అని స్టిక్కర్లను అంటించారు. వాటిని మంత్రి నారా లోకేష్ సభకు తరలించారు. ఏ మాత్రం పరిశీలించకుండా.. చెక్ చేయకుండా వేసేశారు. జగన్ రావాలని లోకేష్ సభ ద్వారా కోరినట్లు ఉందంటూ కొందరు సెటైర్లు వేయటం మొదలుపెట్టారు.