Alleti Maheshwar Reddy : తెలంగాణ సీఎం మారబోతున్నారు- ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేవంత్ కి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారనే చర్చ జరుగుతోందని మీడియాతో అన్నారు ఏలేటి.

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే డిసెంబర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి మారబోతున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఇంఛార్జి మారారంటే ఇక మారేది ముఖ్యమంత్రేనని ఆయన అన్నారు. సీఎం కుర్చీపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కన్ను ఉందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

మీనాక్షి నటరాజన్ ను తీసుకురావడం వెనుక ఉత్తమ్ కే కీలక పాత్ర అని అన్నారు. రేవంత్ కి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారనే చర్చ జరుగుతోందని మీడియాతో అన్నారు ఏలేటి.

గతంలో తాను కాంగ్రెస్ లో పని చేశానని ఏలేటి గుర్తు చేశారు. ఢిల్లీలో తనకున్న సోర్స్, కాంగ్రెస్ ఇంటర్నల్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తానీ వ్యాఖ్యలు చేశానన్నారు. డిసెంబర్ లో తెలంగాణ సీఎం మార్పు ఖాయమన్నారు. మీనాక్షి నటరాజన్ కు అదే టాస్క్ అప్పగించారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఆమె వచ్చింది అదే పనిపై అన్నారు.

గతంలో కుంతియాను ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకురాగా.. పక్కన పెట్టి.. దీపాదాస్ మున్షీని సీఎం రేవంత్ తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీనాక్షి నటరాజన్ ను తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగాలంటే తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే సరిపోదని, ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ టీమ్ మెంబర్ మీనాక్షి నటరాజన్ ఆశీర్వాదం ఉండాలని కూడా మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

అంతేకాదు.. కాంగ్రెస్ లో అనేక మంది సీనియర్లు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సీఎం కుర్చీపై కనేసి ఆ దిశగా ఢిల్లీలో పావులు కదుపుతున్నారని చెప్పారు. ఆర్ ట్యాక్స్ అని, బీ ట్యాక్స్ అని, యు ట్యాక్స్ అని వసూలు చేస్తూ ఎవరికి వారికి కప్పం కడుతున్నారని ఆరోపించారు.

Also Read : కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది- ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి సీఎం రేవంత్ ఫిర్యాదు

కచ్చితంగా డిసెంబర్ సీఎం మారబోతున్నారని, రేవంత్ రెడ్డిని పక్కన పెట్టబోతున్నారని, ఇదే టాస్క్ పై మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చారని, ఆమెను తీసుకొచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం లేదు అనేది స్పష్టంగా కనబడుతోందన్నారు.