Cm Revanth Reddy : కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది- ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి సీఎం రేవంత్ ఫిర్యాదు

మా శాశ్వత కేటాయింపుల్లోని ప్రాజెక్టులపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?

Cm Revanth Reddy : కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది- ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి సీఎం రేవంత్ ఫిర్యాదు

Updated On : March 3, 2025 / 6:12 PM IST

Cm Revanth Reddy : కృష్ణా జలాల్లో వాటాపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా తరలించుకుపోతోందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారాయన. ఏపీ ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరామని, బనకచర్ల ప్రాజెక్ట్ పై తమ అభ్యంతరాలు తెలిపామన్నారు. అటు తెలంగాణ ప్రాజెక్టుల స్థిరీకరణ తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు. తమ విజ్ఞప్తి పట్ల కేంద్రమంత్రి పాటిల్ సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ తెలిపారు.

కృష్ణా బేసిన్ నుంచి ఏపీ ఎక్కువ నీరు తీసుకుంటోందని, దాన్ని అడ్డుకోవాలని ఫిర్యాదు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అటు, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్ట్ పై తమ అభ్యంతరం తెలియజేశామన్నారు. బనకచర్లపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి డీపీఆర్ రాలేదని కేంద్రమంత్రి తమకు చెప్పారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.

కేంద్ర జలశక్తి మంత్రి సీర్ పాటిల్ తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ 40 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు సీఎం రేవంత్. గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రాజెక్టుల లెక్క తేలిన తర్వాతే మిగులు జలాలను ఏపీ వినియోగించుకోవాలని చెప్పారు. గోదావరి నదీ జలాలను తెలంగాణ వినియోగించుకున్న తర్వాతే మిగులు జలాలను ఏపీ వినియోగించుకోవాలన్నారు.

Also Read : తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్లలో స్టాల్స్.. ఉపాధి పొందొచ్చు..

”తెలంగాణ ప్రాజెక్టుల గురించి కేంద్రమంత్రితో చర్చించాం. గోదావరి జలాలను మూసీ నదికి అనుసంధించాలని మొన్నే ప్రధానిని కోరాము. ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగం గురించే ప్రధానంగా చర్చించాం. నికర జలాలపై సమ్మక సారక్క ప్రాజెక్ట్, సీతారామ తదితర ప్రాజెక్టులు కడుతున్నాం.

మా శాశ్వత కేటాయింపుల్లోని ప్రాజెక్టులపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోంది? గోదావరి వరద జలాలపై కట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటే ముందుగా తెలంగాణ నికర జలాల ప్రాజెక్టుల లెక్క తేల్చాల్సిందే. సముద్రంలో వృధాగా కలిసే వరద జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. అలాంటప్పుడు నికర జలాలపై ఉన్న మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యతరం చెబుతోంది?

వరద జలాలపై కట్టిన ఆయకట్టును స్థిరీకరిస్తే.. ఆ మేరకు నీటి కేటాయింపులు జరుపుతామని అంటున్నారు. కృష్ణా జలాలపై కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఆయకట్టు లెక్కల ప్రకారమే తెలంగాణకు తాత్కాలిక వాటా తగ్గింది. కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల 811 టీఎంసీల ఉమ్మడి వాటాలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకుంటోంది. తెలంగాణ కేవలం 299 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటోంది. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఏపీలో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం వల్లే.

Also Read : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. మొదటి విడత రూ.1,00,000 ఇచ్చేది ఎప్పుడో చెప్పిన ప్రభుత్వం

కృష్ణా నదిలో తలెత్తిన పరిస్థితి గోదావరి విషయంలో జరగకూడదు. నికర జలాలపై మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే వరద జలాలపై నిర్మించే ప్రాజెక్టుల సంగతి చూడండి. మా నికర జలాలపై నిర్మించే ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ పెట్టిన అభ్యంతరాలు ఉపసంహరించుకోవాలి. వరద జలాలపై వారు నిర్మించే ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటుంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.